Begin typing your search above and press return to search.

చివరగా చరణ్ ఎక్కడ ఆగాడు?

By:  Tupaki Desk   |   23 May 2018 4:23 AM GMT
చివరగా చరణ్ ఎక్కడ ఆగాడు?
X
ఈ వేసవి ఆరంభంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘రంగస్థలం’. కంటెంట్ విషయంలో, వసూళ్ల విషయంలో ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకపోగా.. వాటిని మించి ఎక్కడికో వెళ్లిపోయింది. ఇంతకుముందు రామ్ చరణ్ మార్కెట్.. సుకుమార్ బాక్సాఫీస్ స్టామినా ప్రకారం అంచనా వేసి చూస్తే ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ సాధించినా చాలా గొప్పే అని అంతా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఇది నాన్-బాహుబలి రికార్డుల్నే బద్దలు కొట్టేసింది. అంతటితో ఆగకుండా కొత్త రికార్డును ఇప్పుడిప్పుడే ఎవ్వరూ అందుకోని స్థాయిలో నెలకొల్పింది. రూ.105 కోట్లతో ‘ఖైదీ నంబర్ 150’ నెలకొల్పిన రికార్డును దాటేసి.. రూ.110 కోట్లు.. రూ.115 కోట్లు.. రూ.120 కోట్లు.. రూ.125 కోట్లు.. ఇలా ఒక్కో మైలురాయిని దాటుతూ సాగిపోయింది. విడుదలైన యాభై రోజుల తర్వాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో షేర్ సాధించింది.

ఐతే ఎట్టకేలకు ‘రంగస్థలం’ జోరుకు దాదాపుగా తెరపడింది. ఈ చిత్ర షేర్లు నామమాత్రంగా వస్తున్నాయి. 50 రోజుల మైలురాయిని కూడా అందుకోవడంతో థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని తీసేస్తున్నారు. మరోవైపు అమేజాన్ ప్రైమ్‌ లో ఉచితంగా సినిమాను చూసే సౌలభ్యం కూడా వచ్చేసింది. దీంతో ‘రంగస్థలం’ థియేట్రికల్ రన్‌ కు తెరపడింది. ఈ చిత్రం ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా రూ.126 కోట్ల షేర్ సాధించడం విశేషం. నైజాంలో రూ.28.5 కోట్ల దాకా వసూలు చేసిన ఈ చిత్రం.. సీడెడ్లో రూ.18.5 కోట్లు కొల్లగొట్టింది. ఉత్తరాంధ్రలో అనూహ్యంగా రూ.13.5 కోట్లు వచ్చాయి. ఆంధ్రాలోని మిగతా ఏరియాలన్నీ కలిపి రూ.31 కోట్ల షేర్ వసూలైంది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 3.5 మిలియన్ మార్కును దాటి ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు సినిమా ‘భరత్ అనే నేను’ పాజిటివ్ టాక్ తెచ్చుకుని కూడా రూ.100 కోట్ల లోపే షేర్ తేగలిగింది. చూస్తుంటే ‘రంగస్థలం’ రికార్డు చాలా కాలం నిలిచి ఉండేలా కనిపిస్తోంది.