Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: గుండెను కదిలించిందిగా

By:  Tupaki Desk   |   20 Dec 2017 5:34 AM GMT
ట్రైలర్ టాక్: గుండెను కదిలించిందిగా
X
ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించింది రాణి ముఖర్జీ. వరసపెట్టి టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రాను పెళ్లి చేసుకున్నాక నటనకు బైబై చెప్పేసింది. కూతురు పుట్టాక ఆమె పెంపకంలో బిజీ అయిపోయింది. చాలా కాలం తరవాత మళ్లీ ఇప్పుడు ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈసారి కాస్తంత నవ్విస్తూనే గుండెను కదిలించే భావోద్వేగంతో కూడిన కథను ఎంపిక చేసుకుని వచ్చింది.

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాణి ముఖర్జీ లేటెస్ట్ గా హిచ్ కీ మూవీ చేస్తోంది. ఇదొక టీచర్ కథ. అందరిలాంటి టీచర్ కాదు. టురెట్ సిండ్రోమ్ అనే న్యూరలాజికల్ డిజార్డర్ (మానసిక సంబంధ) ఉన్న మహిళ. బ్రెయిన్ నరాలు లూజ్ కాంటాక్ట్ తో ఉన్నప్పుడు షాక్ లాగా వస్తుంటుంది. దీంతో తల విదిలిస్తూ చాక్ చాక్ అంటూ ఓ విచిత్రమైన శబ్దం నోటివెంట వచ్చేస్తుంటుంది. ఇలాంటి స్పీచ్ డిఫెక్ట్ ఉన్న ఆమెకు టీచర్ కావాలన్నది కల. చివరకు ఆమెకు పేరున్న స్కూలులో టీచర్ ఉద్యోగమొస్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ వల్ల మున్సిపల్ స్కూల్లోని 14 మందికి అదే స్కూలులో అడ్మిషన్ వస్తుంది. వాళ్లకు ఈమెను టీచర్ గా నియమిస్తారు. చదువుపై ఎలాంటి ఇంట్రస్ట్ లేని వాళ్లను చివరకు విద్యావంతులుగా తీర్చిదిద్దింది.. ఆ ప్రయత్నంలో ఎన్ని అవమానాలకు గురైంది.. ఎన్ని బాధలు పడిందన్నది కథాంశంగా సినిమా సాగుతుంది.

హిచ్ కీ ట్రయిలర్ చూసినవారికి దాదాపు సినిమా స్టోరీ ఏంటనేది ఇట్టే అర్ధమైపోతుంది. కాకుంటే ఇది భావోద్వేగాలతో కూడిన కథ కాబట్టి వాటిని తెరపైన పూర్తిస్థాయిలో చూసినప్పుడే ఆస్వాదించగలం. ఇదేటైంలో విద్యావ్యవస్థలోని లోపాలను.. మానసిక సమస్యలతో జీవనం సాగించేవారు ఎదుర్కొనే అవమానాలను సైతం ఈ సినిమాలో చూపించబోతున్నారని అర్ధమవుతుంది. మొదటిలో కాస్తంత నవ్వు తెప్పించిన ట్రయిలర్ నిమిషం వ్యవధిలోనే సీరియస్ మూడ్ లోకి తీసుకెళ్లిపోతుంది. సిద్ధార్ధ్ పి.మల్హోత్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.