Begin typing your search above and press return to search.

అచ్చం క‌పిల్ దేవ్ ని దించాడు!

By:  Tupaki Desk   |   6 July 2019 5:54 AM GMT
అచ్చం క‌పిల్ దేవ్ ని దించాడు!
X
పెష్వా భాజీరావ్ (భాజీరావ్ మ‌స్తానీ).. అల్లా ఉద్దీన్ ఖిల్జీ (ప‌ద్మావ‌త్) వంటి ఛాలెంజింగ్ పాత్ర‌ల‌తో ర‌ణ‌వీర్ సింగ్ స‌త్తా చాటిన‌ సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో ఖాన్ ల‌ను కొట్టే మొన‌గాళ్ల జాబితాలో ఈ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో పేరు మార్మోగిపోతోంది. ఇటీవ‌లే జోయా అక్త‌ర్ తెర‌కెక్కంచిన గ‌ల్లీ బోయ్స్ చిత్రంలోనూ ర్యాప‌ర్ పాత్ర‌లో ఇర‌గ‌దీశాడ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. వీట‌న్నిటినీ మించిన పెర్ఫామెన్స్ ర‌ణ‌వీర్ నుంచి చూడ‌బోతున్నామా? అంటే ఇదిగో ఈ ఫ‌స్ట్ లుక్ అందుకు సాక్ష్యం.

ఈసారి కూడా ర‌ణ‌వీర్ ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌లో తెర‌పై క‌నిపించ‌బోతున్నాడు. అది కూడా లివింగ్ లెజెండ్ క‌పిల్ దేవ్ పాత్ర‌లో న‌టించ‌డం హాట్ టాపిక్ గా మారింది. క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా టైటిల్ 83. ఇప్ప‌టికే ప్రీలుక్స్ రిలీజై అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. అలాగే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లు జ‌రుగుతున్న ఇంగ్లండ్ లో 83 క్లైమాక్స్ ని తెర‌కెక్కించేందుకు ర‌ణ‌వీర్ బృందం లార్డ్స్ కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే.

నేడు ర‌ణ‌వీర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యువ‌కుడైన క‌పిల్ దేవ్ ఎలా ఉండేవాడో .. ఆ గెట‌ప్ లో ర‌ణ‌వీర్ రూపం ఎలా ఉందో రివీల్ చేస్తూ పోస్ట‌ర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్ట‌ర్ లో పోలిక‌లు అచ్చు గుద్దిన‌ట్టు దిగిపోయాయి. అచ్చం యువ‌కుడైన క‌పిల్ ని త‌ల‌పిస్తున్నాడు ర‌ణ‌వీర్. తీక్ష‌ణ‌మైన ఆ చూపు.. ఫోర్ క‌ట్స్ బంతిని స్పిన్ తిప్పుతున్న‌ట్టు చేత్తో ప‌ట్టుకున్న తీరు.. ఆ రింగుల జుత్తు ఇవ‌న్నీ అచ్చం క‌పిల్ నే త‌ల‌పిస్తున్నాయి. మెడలో నల్లని తాడు.. వైట్ స్పోర్ట్స్ టీ షర్ట్ ఇవ‌న్నీ నాటి క్రికెట‌ర్ గెట‌ప్ కి సింబాలిక్. 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ ని టీమిండిగా గెలుచుకున్న‌ప్పుడు క‌పిల్ లోని ధ‌ర‌హాసం ఎలా ఉంటుందో ర‌ణ‌వీర్ తెర‌పై చూపించ‌బోతున్నాడు. ఇక ఈ చిత్రంలో దీపికా పదుకొనె ఆయన భార్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్- విబ్రి మీడియా- సాజిద్ నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవి కానుకగా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.