Begin typing your search above and press return to search.

బాప్ రే నిమిషానికి 33 లక్షలా?

By:  Tupaki Desk   |   26 March 2018 12:03 PM GMT
బాప్ రే నిమిషానికి 33 లక్షలా?
X
అంతే మరి. డిమాండ్ ఎవరెస్ట్ శిఖరం మీదునప్పుడు రేట్ నేల మీద ఉంటుందా. రన్వీర్ సింగ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. పద్మావత్ సినిమాలో ఖిల్జీ పాత్ర ద్వారా తన రేంజ్ ని అమాంతం వందల రెట్లు పైకి తీసుకెళ్ళిన రన్వీర్ సింగ్ బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు. తాజాగా ఐపిఎల్ ఓపెనింగ్ సెర్మనీ కోసం ఇతనికి వచ్చిన ప్రతిపాదన తలలు పండిన సీనియర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 15 నిమిషాల పాటు ఐపిఎల్ లో పెర్ఫార్మ్ చేయడానికి రన్వీర్ సింగ్ కు అక్షరాలా 5 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారట. అంటే ఒక్కో నిమిషానికి లెక్క వేసుకుంటే 33 లక్షల 33 వేల 333 రూపాయల 33 పైసలు. కళ్ళు తిరుగుతున్నాయి కదూ. ఓ పెద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇంత మొత్తం సంపాదించాలంటే కనీసం రెండేళ్ళు మెదడు - ఒళ్ళు హూనం చేసుకుని పైసా ఖర్చు పెట్టకుండా వెనకేసుకుంటే తప్ప సంపాదించలేడు. కాని ఇది రన్వీర్ సింగ్ కు ఒక్క నిమిషానికి వచ్చే ఆదాయం.

ఇది అధికారికంగా వచ్చిన సమాచారం కాదు కాని బాలీవుడ్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి మొదలుకానున్న ఐపిఎల్ సీజన్ 11 కోసం క్రికెట్ ప్రేమికులు విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆదాయం పుష్కలంగా ఉండే ఈ టోర్నమెంట్ ని గ్రాండ్ గా నిర్వహించేందుకు బిసిసిఐ భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. అందుకే రన్వీర్ సింగ్ అంత డిమాండ్ చేసినా మారు మాట్లాడుకుండా ఒప్పుకున్నట్టు టాక్. రన్వీర్ సింగ్ ఒక్కడే స్టేజి షో చేస్తాడా ఎవరైనా హీరొయిన్ కంపెనీ ఇస్తుందా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

రన్వీర్ సింగ్ ప్రస్తుతం గల్లీ బాయ్ తో పాటు టెంపర్ రీమేక్ సింబాలో కూడా నటిస్తున్నాడు. ఇవి కాకుండా సంజయ్ లీలా భన్సాలీ రూపొందించబోయే మరో భారీ విజువల్ వండర్ కోసం చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఖాన్ అధిపత్యానికి గట్టి బ్రేక్ వేసేలా కనిపిస్తున్న రన్వీర్ సింగ్ స్పీడ్ చూస్తుంటే మరో రెండు హిట్లు పడితే మాత్రం అందుకోవడం కష్టం అనిపించేలా ఉన్నాడు.