Begin typing your search above and press return to search.

బాలీవుడ్ 'కత్తి'.. ఆ హీరోనేనా?

By:  Tupaki Desk   |   29 Aug 2018 1:30 AM GMT
బాలీవుడ్ కత్తి.. ఆ హీరోనేనా?
X
బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ తీసే సినిమాలన్నీ కళాత్మకంగా ఉంటాయి. ఆయన ప్రతి సినిమాలోనూ ఆర్టిస్టిక్ బ్రిలియన్స్ కనిపిస్తుంది. ఆయన సినిమాలన్నీ క్లాసిక్స్‌గానే గుర్తింపు తెచ్చుకున్నాయి. ఐతే బన్సాలీ ప్రొడ్యూస్ చేసే సినిమాలు మాత్రం దీనికి భిన్నంగా ఉంటాయి. ఆయన దక్షిణాదిన వచ్చిన మంచి కమర్షియల్ ఎంటర్టైనర్లను ఎంచుకుని హిందీలో రీమేక్ చేయిస్తుంటాడు. ‘రౌడీ రాథోడ్’.. ‘గబ్బర్’ ఈ కోవలోని సినిమాలే. ‘విక్రమార్కుడు’కు రీమేక్ గా వచ్చిన ‘రౌడీ రాథోడ్’ బ్లాక్ బస్టర్ అయింది. ‘ఠాగూర్’ రీమేక్ ‘గబ్బర్’ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. బన్సాలీ ఇప్పుడు తమిళ బ్లాక్ బస్టర్ ‘కత్తి’ రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘ఖైదీ నంబర్ 150’ పేరుతో రీమేక్ అయి ఇక్కడా పెద్ద విజయం సాధించింది.

‘కత్తి’ని హిందీ నేటివిటీకి తగినట్లు మార్చి మంచి కమర్షియల్ సినిమాగా చేయాలని బన్సాలీ చూస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడెవరో ఇంకా ఖరారవ్వలేదు. హీరో మాత్రం దాదాపుగా కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు రణ్వీర్‌ సింగే ‘కత్తి’ రీమేక్ లో నటిస్తాడని అంటున్నారు. అతను ఇప్పటికే ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’లో నటిస్తున్నాడు. బన్సాలీ తీసిన ‘రామ్ లీలా’.. ‘బాజీరావు మస్తానీ’.. ‘పద్మావత్’ చిత్రాలతో రణ్వీర్ రేంజే మారిపోయింది. ఐతే వరుసగా కళాత్మక చిత్రాలే చేస్తూ వచ్చిన రణ్వీర్.. ఇప్పుడు మాస్ బాట పట్టాడు. అందులో భాగంగానే ‘సింబా’ తర్వాత ‘కత్తి’ రీమేక్‌ లోనూ నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు అక్షయ్ కుమార్ పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ.. తమ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్’ ఆడని నేపథ్యంలో బన్సాలీ ఆలోచన మార్చుకుని రణ్వీర్‌ ను ఖరారు చేసినట్లు సమాచారం.