Begin typing your search above and press return to search.

మీ ఊహకే వదిలేస్తున్నా: ప్రశాంత్ నీల్

By:  Tupaki Desk   |   10 Feb 2020 1:20 PM GMT
మీ ఊహకే వదిలేస్తున్నా: ప్రశాంత్ నీల్
X
కన్నడ సినిమా 'కె.జి.ఎఫ్‌: చాప్టర్ 1' తెలుగు సహా పలు ఇతర భాషలలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ నటించిన ఈ సినిమా కన్నడ పరిశ్రమపై అందరి దృష్టి పడేలా చేసింది. మొదటి భాగం ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం రెండవ భాగాన్ని మరింత భారీస్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తుండగా మరో సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా 'కె.జి.ఎఫ్‌ 2' టీమ్ తో జాయిన్ అయ్యారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సూపర్ టాలెంటెడ్ తెలుగు యాక్టర్ రమేష్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంచుకున్నారు. ఈమధ్యే రావు రమేష్ 'కె.జి.ఎఫ్‌ 2' షూటింగ్ లో జాయినయ్యారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సంగతిని స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "రావు రమేష్ సర్.. మీకు కె.జి.ఎఫ్‌ 2 టీమ్ లోకి స్వాగతం. మీ పాత్ర ఎలా ఉండబోతోందో అనే విషయాన్ని వెండితెరపై చూసేవరకూ ప్రేక్షకుల ఊహాశక్తికే వదిలివేస్తున్నాం. కె.జి.ఎఫ్‌: చాప్టర్ 2 లో భాగం అయినందుకు మీకు మా కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేస్తూ ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

ఈ ఫోటోలో రావు రమేష్.. ప్రశాంత్ నీల్ ఇద్దరూ ముచ్చటించుకుంటున్నారు. భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా ఫిలింగా తెరకెక్కుతున్న 'కె.జి.ఎఫ్‌ 2' నటించడం రావు రమేష్ కు దక్కిన మంచి అవకాశమనే చెప్పాలి. ప్రశాంత్ చెప్పినట్టుగా రావు రమేష్ పాత్ర ఎలా ఉంటుందోనని ఆసక్తి కలుగుతోంది. శ్రీనిధి శెట్టి.. శరణ్ శక్తి ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను జూన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.