Begin typing your search above and press return to search.

‘డీజే’లోనూ ఆయన హైలైట్ అయ్యేలా ఉన్నాడే..

By:  Tupaki Desk   |   7 Jun 2017 6:10 AM GMT
‘డీజే’లోనూ ఆయన హైలైట్ అయ్యేలా ఉన్నాడే..
X
కొందరు దర్శకులకు కొందరు నటుల మీద మంచి గురి ఉంటుంది. వాళ్లే సినిమా తీసినా అందులో ఆ నటులకు చోటుంటుంది. వాళ్ల కోసం ప్రత్యేకమైన పాత్రలు తీర్చిదిద్దారు. సినిమాలో వాళ్లు హైలైట్ అయ్యేలా చూసుకుంటారు. హరీష్ శంకర్-రావు రమేష్ కాంబినేషన్ ఇలాంటిదే. హరీష్ రెండో సినిమా ‘మిరపకాయ్’ దగ్గర్నుంచి హరీష్-రావు రమేష్ బంధం కొనసాగుతోంది. ఆ సినిమాలో కాలేజ్ ప్రిన్సిపాల్ గా రావు రమేష్ కు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు హరీష్. అది బాగా వర్కవుటైంది. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’.. ‘రామయ్యా వస్తావయ్యా’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లోనూ రావు రమేష్ కు కీలకమైన పాత్రలు దక్కాయి. ముఖ్యంగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో బియ్యం బుజ్జిగా రావు రమేష్ పంచిన వినోదం ఆ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

హరీష్ శంకర్ తన కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’లోనూ రావు రమేష్ కు మంచి పాత్రే ఇచ్చినట్లున్నాడు. ‘డీజే’ ట్రైలర్లో హీరో హీరోయిన్ల తర్వాత బాగా హైలైట్ అయ్యిందంటే రావు రమేషే. ‘‘నేను మీలా పెద్ద పెద్ద చదువుకోలేదబ్బా.. పెద్ద బాల శిక్ష చదువుకున్నానంతే’’ అంటూ రావు రమేష్ తనదైన మాడ్యులేషన్ తో చెప్పిన డైలాగ్ భలేగా పేలింది. రావు రమేష్ గెటప్ అదీ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఈసారి పక్కా విలేజ్ క్యారెక్టర్ చేస్తున్నట్లున్నాడు రమేష్. ఈ పాత్ర.. దాని ఆహార్యం చూస్తే రావు రమేష్ తండ్రి రావుగోపాల్రావు గుర్తుకొస్తున్నాడు జనాలకు. మామూలు పాత్రల్ని కూడా తన నటన.. టిపికల్ డైలాగ్ డెలివరీతో మరో స్థాయికి తీసుకెళ్తాడు రావు రమేష్. హరీష్ లాంటి డైరెక్టర్లతో అతడికి బాగా సింక్ అవుతుంది. ‘డీజే’లో కూడా హరీష్ రైటింగ్.. రావు రమేష్ యాక్టింగ్ బాగా సింక్ అయి ఈ పాత్ర బాగానే వచ్చిందంటోంది చిత్ర బృందం. మరి ఈ క్యారెక్టర్ ఎలా ఎంటర్టైన్ చేస్తుందో జూన్ 23న చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/