Begin typing your search above and press return to search.

సోనూసూద్ తల్లికి అరుదైన గుర్తింపు.. ఎమోషన్ అయిన రియల్ హీరో

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:01 AM GMT
సోనూసూద్ తల్లికి అరుదైన గుర్తింపు.. ఎమోషన్ అయిన రియల్ హీరో
X
కరోనా విరుచుకుపడిన వేళ.. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటంతో కార్మికులు.. పేదవారు తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఇలాంటివేళ.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన నటుడు సోనూసూద్.. తన పెద్ద మనసుతో పేదలు.. కష్టంలో ఉన్న వారు ఎవరైనా సరే.. వారిని ఆదుకుంటున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయిల్ని ఖర్చుచేయటమే కాదు.. కష్టంలో ఉన్నా.. ఫలానా సాయం కావాలని కోరినంతనే స్పందించిన అతడి తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటోంది.

ఇలాంటివేళ.. సోనూసూద్ సొంతూరులో ఆయన తల్లికి అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ లోని మోగా అనే ఊళ్లో సోనూసూద్ కుటుంబం ఉంటుంది. ఆ ఊళ్లోనే సోనూసూద్ తల్లి కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసేవారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న స్థానికులు.. ఆమె కాలేజీకి నడిచివెళ్లే ఒక మార్గానికి.. ఆమె పేరును పెడుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్ అంటూ రోడ్డుకు పేరుపెట్టటమే కాదు.. ఒక శిలా ఫలకాన్ని ప్రముఖంగా ఏర్పాటు చేశారు.

దీన్ని తాజాగా స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ విషయంపై సోనూసూద్ స్పందించారు. తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో కలగన్న రోజుగా చెప్పారు. ప్రొఫెసర్ సరోజ్ సూద్ రోడ్ అన్న నిర్ణయం తనను కదిలించినట్లు చెప్పారు. ‘అదే రోడ్డులో మా అమ్మ ప్రతి రోజూ వెళ్లి వచ్చేది. ఇవాల్టి రోజున అక్కడి దృశ్యం చేసిన స్వర్గంలోఉన్న నా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు’ అని ఎమోషనల్ ట్వీట్ చేశారు. సోనూ చేస్తున్న సేవా కార్యక్రమాలతో పోల్చినప్పుడు.. ఆయన తల్లికి లభించిన అరుదైన గౌరవం చిన్నదేనని చెప్పక తప్పదు.