Begin typing your search above and press return to search.

రాశి - తేజుల ప్రేమ మధ్యలో టిక్ టాక్!

By:  Tupaki Desk   |   28 Sep 2019 6:02 AM GMT
రాశి - తేజుల ప్రేమ మధ్యలో టిక్ టాక్!
X
ఒక్కో జెనరేషన్లో జనాలకు ఒక్కో దానిపై క్రేజ్ ఉంటుంది. అప్పట్లో ఆర్కుట్ అంటే పడి చచ్చిపోయేవాళ్ళు జనాలు. ఇప్పుడు అది చరిత్రలో ఒక పేజీగా మారింది. రోజులో 24 గంటలు ఉంటే ఫేస్ బుక్ కు గతంలో కనీసం ఓ పది గంటలు వెచ్చించేవారు జనాలు.. ఇప్పుడు యూత్ ఎఫ్ బీకి సరిగ్గా గంట కూడా వెచ్చించడం లేదు. త్వరలో ఎఫ్ బీ మరుగున పడుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జనాలను సోషల్ మీడియాలో ఊపేస్తున్నవి నాలుగు. వాట్సాప్.. ట్విట్టర్.. టిక్ టాక్.. ఇన్స్టాగ్రామ్. మొదటి రెండు అందరికీ తెలిసిందే. ఇన్స్టా ఇంకా కాస్త క్లాస్ గా ఉండే క్రౌడ్ కు మాత్రమే పరిమితం అయింది కానీ టిక్ టాక్ మాత్రం దేశంలోని మారుమూలల్లోకి కూడా చొరబడింది.

అతి తక్కువ సమయంలో సూపర్ పాపులర్ అయింది. అసలు ఎవరి ఫోన్ లో ఫార్వార్డ్ వీడియో చూసినా అది దాదాపుగా టిక్ టాక్ అయి ఉంటుంది. టిక్ టాక్ వీడియోల మాయ అలా ఉంది మరి. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నాడట మన టాలీవుడ్ దర్శకుడు మారుతి. సాయి ధరమ్ తేజ్ - రాశి ఖన్నా హీరో హీరాయిన్లుగా మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ రాశి టిక్ టాక్ అంటే పడి చచ్చిపోయే అమ్మాయిగా కనిపిస్తుందట. ఏ సందర్భం అయినా ఒక టిక్ టాక్ వీడియో చేస్తుందట. ఈ వీడియోలతో తనకు తెలియకుండానే తేజును సతాయిస్తుందట. అలా సతాయిస్తూనే ఓ రోజు తన ప్రేమలో పడేస్తుందట. రాశి పాత్రతో మన జనాల టిక్ టాక్ వ్యసనాన్ని మారుతి ఫన్నీగా చూపించాడని సమచారం.

మారుతి ఎంచుకునే పాత్రల్లో ఏదో ఒక లోపమో.. వ్యసనమో ఉంటుంది. వాటితో ప్రేక్షకులను మెప్పించేలా సిట్యుయేషనల్ కామెడీని డిజైన్ చేసుకోవడం మొదటి నుంచి మారుతి స్టైల్. ఇప్పుడు టిక్ టాక్ వీడియోస్ పై ఫోకస్ పెట్టాడు.. అంతే.