Begin typing your search above and press return to search.

ఆ రాత్రి వారు మనుషుల్లా ప్రవర్తించలేదు : రష్మీ

By:  Tupaki Desk   |   19 March 2019 11:50 AM GMT
ఆ రాత్రి వారు మనుషుల్లా ప్రవర్తించలేదు : రష్మీ
X
రెండు రోజుల క్రితం విశాఖపట్నం గాజువాకలో యాంకర్‌ రష్మీ ప్రయాణిస్తున్న కారు ఢీ కొని ఒక వ్యక్తికి గాయాలు అయిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కారును రష్మీ డ్రైవ్‌ చేస్తుందని, ఆమె కొత్త కారుతో ర్యాష్‌ గా డ్రైవ్‌ చేసిన కారణంగానే యాక్సిడెంట్‌ అయ్యిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. గత రెండు రోజులుగా రష్మీ గురించి పలు కథనాలు మీడియాలో వస్తున్నాయి. రష్మీ పై కేసు నమోదు అయ్యిందని, రష్మీ కొత్త కారును సీజ్‌ చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. తన గురించి మీడియాలో వస్తున్న కథనాలపై రష్మీ స్పందించింది.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన రష్మీ యాక్సిడెంట్‌ గురించి మాట్లాడుతూ... ఒక వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ నిమిత్తం నేను వైజాగ్‌ వెళ్లాను. అక్కడ రాత్రి షూటింగ్‌ ముగించుకుని కంపెనీ కారులో ఇంటికి బయలుజేరాను. ఆ సమయంలో నేను డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్నాను. నేను డ్రైవ్‌ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే నేను 108కు ఫోన్‌ చేశాను. అయితే 108 రాక ఆలస్యం అయిన నేపథ్యంలో పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశాము. ప్రమాదం జరిగిన వెంటనే చాలా మంది అక్కడ గుమ్మి గూడారు. నేను కారు డోర్‌ తీయగానే వెంటనే అంతా ఫొటోలు - వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ప్రమాదంలో గాయ పడ్డ వ్యక్తిని కాపాడాలని కూడా చూడకుండా నన్ను విమర్శించడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వారు మనుషుల మాదిరిగా ప్రవర్తించకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించారు. యాక్సిడెంట్‌ అయిన వ్యక్తిని హాస్పిటల్‌ కు తరలిస్తున్నా కూడా దారి ఇవ్వకుండా నీచంగా ప్రవర్తించారు. డ్రైవర్‌ మరియు నేను యాక్సిడెంట్‌ అయిన వ్యక్తిని హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశాము.

దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు అయ్యింది. డ్రైవర్‌ గౌతమ్‌ ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నేను డ్రైవింగ్‌ లో ఉన్నాను అంటూ కొందరు చేస్తున్న ప్రచారంకు నేను సమాధానం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ విషయాలన్ని చెబుతున్నాను. యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తులు ఎందుకు పారి పోతారో ఇప్పుడు నాకు అర్థం అయ్యింది. వారు సాయం చేయాలని భావించిన ఇతరులు వారిని అపార్థం చేసుకోవడంతో పాటు వారిపై దాడి చేస్తారు. అందుకే యాక్సిడెంట్‌ చేసిన వారు సాయం చేసేందుకు ఆసక్తి చూపించరేమో అనిపిస్తుంది. అదృష్టం బాగుండి యాక్సిడెంట్‌ అయిన వ్యక్తి స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. యాక్సిడెంట్‌ కు కారణం ఆ వ్యక్తి అని చెప్పేందుకు నేను వంద కారణాలు చెప్పగలను. కాని గాయపడ్డ వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అంటూ ఆ రోజు రాత్రి జరిగిన యాక్సిడెంట్‌ పట్ల - తనపై వచ్చిన విమర్శల పట్ట తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.