Begin typing your search above and press return to search.

సౌందర్య బయోపిక్ పై క‌న్నేసిన క్రేజీ హీరోయిన్

By:  Tupaki Desk   |   16 Sep 2021 6:32 AM GMT
సౌందర్య బయోపిక్ పై క‌న్నేసిన క్రేజీ హీరోయిన్
X
రష్మిక మందన్న ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగు-హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంది. అంతేకాదు త‌న‌కు బ‌యోపిక్ లో నటించాల‌నుంద‌ని అది కూడా అందాల న‌టి సౌంద‌ర్య గా క‌నిపించాల‌నుంద‌ని మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టింది. ``నేను పరిశ్రమలోకి రాకముందు మా నాన్న నేను నటి సౌందర్యను పోలి ఉంటానని ఎప్పుడూ చెప్పేవారు. ఆమె ఇండ‌స్ట్రీ చేసిన సేవ‌ నాకు నచ్చింది. నేను సౌంద‌ర్య‌ బయోపిక్ చేయాలనుకుంటున్నాను`` అని రష్మిక అన్నారు.

ఇటీవ‌ల‌ బ‌న్ని స‌ర‌స‌న‌ అరుదైన అవ‌కాశాన్ని అందుకుంది ర‌ష్మిక మంద‌న‌. పుష్ప డ్యూయాల‌జీలో న‌టిస్తోంది. పుష్ప రెండు భాగాలుగా రూపొందుతుండ‌గా రెండు భాగాల్లోనూ త‌న‌కు ఆఫ‌ర్ లభించింది. త‌ర్వాత కూడా బ‌న్ని స‌ర‌స‌న ఐకాన్ లోనూ క‌థానాయికగా త‌న పేరు వినిపిస్తోంది. ఆస‌క్తిక‌రంగా పుష్ప 1 త‌ర్వాత ఐకాన్ మూవీ తెర‌కెక్క‌నుంది. బ‌న్ని ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న‌ట్టే లెక్క‌. అలాంటి అరుదైన అవ‌కాశం రష్మిక‌కు మాత్ర‌మే ద‌క్కుతోంది. ప్రస్తుతం పుష్ప‌1 చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఈ సినిమా రిలీజ‌య్యాక సెకండ్ పార్ట్ కి ముందు బ‌న్ని ఐక‌న్ చిత్రంలో న‌టిస్తారు. శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు న‌టీన‌టుల‌ను ఫైన‌ల్ చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే న‌టిస్తోంద‌ని కూడా గుస‌గుసలు వినిపిస్తున్నాయి.

న‌టి సౌంద‌ర్య ప్ర‌స్థానం..

సౌందర్య తెలుగు- తమిళం- కన్నడం- మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా వెలిగిన ఈమె 2004లో బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో మరణించింది. ఈమె 100 కు పైగా చిత్రాలలో నటించింది.

సౌందర్య అసలు పేరు సౌమ్య. సినీరంగ ప్రవేశం కోసం ఆమె పేరును సౌందర్యగా మార్చుకుంది. ఆమె ప్రాథమిక విద్యను అభ్యసించేటపుడే మొదటి చిత్రంలో నటించింది. ఆమె ఎం.బి.బి.ఎస్ మొదటి సంవత్సరంలో ఉండగా త‌న‌ తండ్రి స్నేహితుడు గంధర్వ (1992) చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. అమ్మోరు చిత్రం విజయవంతమైన తరువాత ఆమె చదువును మధ్యలోనే ఆపేసింది.

తరువాత ఆమె తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె మంచి పేరు ప్రఖ్యాతులు గడించి విజయఢంకా మ్రోగించింది. ఇత‌ర ద‌క్షిణాది చిత్రాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె అమితాబ్ బచ్చన్ తో కలిసి సూర్యవంశ్ అనే హిందీ చిత్రంలో నటించింది.

సౌందర్య గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో ద్వీప అనే కన్నడ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం జాతీయ పురస్కారాలలో ఉత్తమ చిత్రానికి గాను స్వర్ణకమలంతో పాటు పలు పురస్కారాలు అందుకుంది. ఈ చిత్రానికి కర్ణాటక ప్రభుత్వం నుండి ఉత్తమ నటి.. ఉత్తమ చిత్రం.. ఉత్తమ ఛాయాచిత్రగ్రహణానికి గాను పురస్కారాలు లభించాయి. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శింపబడింది.

సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మరణించింది. ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మద్దతు పలుకుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసంగించడానికి బయలుదేరుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆమె సోదరుడు కన్నడ చిత్రాల నిర్మాత అయిన అమర్ నాధ్ కూడా ఆ ప్రమాదంలో మరణించాడు. ఆమె కన్నడంలో నటించిన ఆఖరి చిత్రం `ఆప్త మిత్ర` విజయవంతమైంది. ప్రస్తుతం ఆమె జ్ఞాపకార్ధం `సౌందర్య స్మారక పురస్కారం`ను కర్ణాటకాంధ్ర లలితకళ అకాడమి వారు ప్రతీ సంవత్సరం ఉగాది పండుగ రోజున ఉత్తమ నటీమణులకు బహుకరిస్తున్నారు.

తెలుగు సినీపరిశ్రమలో అత్యంత ప్రభాశాలురైన నటీమణులలో సౌందర్య ఒకరు. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ సరసన రాజా- జయం మనదేరా- పెళ్ళి చేసుకుందాం- పవిత్ర బంధం వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రశంసలందుకున్నారు. వారిద్దరూ తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన జంటగా గుర్తింపు ద‌క్కించుకున్నారు. అందాల ప్రదర్శనకి బద్ధ వ్యతిరేకి. తెలుగు ప్రజలు ఆమెనెప్పటికీ మరువలేరు. పన్నెండేళ్ళ అచిరకాలంలోనే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలనందుకొంది.