Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండతో ఎఫైర్ గురించి స్పందించిన రష్మిక!

By:  Tupaki Desk   |   18 Feb 2022 4:31 AM GMT
విజయ్ దేవరకొండతో ఎఫైర్ గురించి స్పందించిన రష్మిక!
X
అందం .. అభినయం .. అదృష్టం .. ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందంటే, అందుకు ఉదాహరణగా రష్మికను చూపించవచ్చు. ఎందుకంటే ఈ పిల్ల 'ఛలో' అంటూ తెలుగులోకి అడుగుపెడుతూనే, తొలి సినిమాతోనే హిట్ కొట్టేసింది. అమ్మాయి పాల సరస్సులో పూసిన తెల్ల తామరలా ఉందని కుర్రాళ్లంతా మురిసిపోయారు .. ముచ్చటపడ్డారు. తమ హార్ట్ వాల్ పై ఆమె పోస్టర్ ను గట్టిగానే అంటించేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'గీత గోవిందం' సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో సరదాగా హీరోపై కోపాన్ని నటించే ఆ పాత్రలో ఆమె మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఆ సినిమాతో అమ్మడి అదృష్టం రాకెట్ స్పీడ్ ను అందుకుంది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'భీష్మ' .. ఇటీవల వచ్చిన 'పుష్ప' సినిమాతో వచ్చిన హిట్లు ఆమె ఖాతాలోకి ఆనందంగా చేరిపోయాయి. దాంతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా రష్మిక చేరిపోయింది.

తెలుగుతో పాటు కన్నడ సినిమాలతోను బిజీగా ఉంది. అలాగే తమిళ .. హిందీ సినిమాల్లో కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమె విజయ్ దేవరకొండతో లవ్ లో ఉందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి 'డియర్ కామ్రేడ్' చేసిన దగ్గర నుంచి మొదలైన ఈ ప్రచారం నెమ్మదిగా బలపడుతోంది.

ఇటీవల కూడా విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా షూటింగు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి ఆయనను కలిసిందనే వార్త ఒకటి జోరుగానే షికారు చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్న రష్మికకు ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. "ఒకటి రెండు సినిమాలు కలిసి చేస్తే ఇలాంటి రూమర్స్ రావడం కామన్. మీడియాలో వచ్చే ఇలాంటి రూమర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను" అంటూ రెండే ముక్కల్లో తేల్చేసింది. 'నిప్పులేనిదే పొగరాదే' అంటే .. 'ఆ నిప్పు పెట్టిందే మీరు' అన్నట్టుగా సమాధానమిచ్చింది.

ఇక ప్రస్తుతం రష్మిక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. శర్వానంద్ జోడీగా ఆమె అలరించనున్న ఈ సినిమాకి కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. ఇక హిందీలోను రెండు సినిమాలు థియేటర్లకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక వచ్చే నెల నుంచి 'పుష్ప 2' షూటింగుతో ఆమె బిజీ కానుంది. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్ దేవరకొండ - రష్మిక కాంబినేషన్లో ఒక సినిమా తీయాలనే ప్రయత్నాలు పెద్ద బ్యానర్ల వైపు నుంచే జరుగుతున్నట్టుగా కూడా ఒక టాక్ వినిపిస్తోంది. అందులో ఎంతవరకూ నిజముందో మరి!