Begin typing your search above and press return to search.

పందికి ర‌జ‌నీకాంత్‌ రెమ్యున‌రేష‌న్‌?

By:  Tupaki Desk   |   6 Nov 2018 3:30 AM GMT
పందికి ర‌జ‌నీకాంత్‌ రెమ్యున‌రేష‌న్‌?
X
పంది పిల్ల‌తో ర‌విబాబు సినిమా తీస్తున్నారు స‌రే.. ఇంత‌కీ ఆ పందికి రెమ్యున‌రేష‌న్ ఎంతిచ్చారేంటి? ఈ ప్ర‌శ్న‌కు ర‌విబాబు నుంచి స‌మాధానం వ‌చ్చింది. యానిమ్యాట్రిక్స్‌ లో పంది పిల్ల‌ను క్రియేట్ చేయాలంటే ర‌జ‌నీకాంత్ పారితోషికం అంత చెల్లించాల్సిన స‌న్నివేశం వ‌చ్చింద‌ని - దాంతో ఆ ప్ర‌య‌త్న‌మే విర‌మించుకున్నామ‌ని షాకిచ్చే సంగ‌తినే చెప్పారు.

అస‌లు అదుగో క‌థేమి? అని ప్ర‌శ్నిస్తే.. చుట్టూ ఉన్నావాళ్లంద‌రినీ ఆడుకునే పందిపిల్ల ఒక రోజంతా వీళ్ల‌తో గ‌డిపి.. సాహ‌సాలు చేసి - చివ‌రికి బుద్ధి తెచ్చుకుని మ‌ళ్లీ ఇంటికి ఎలా చేరింది.. అన్న‌ది అదుగో చిత్రంలో చూడండి అన్నారు.
పందితోనే చేయ‌డానికి కార‌ణం ఏంటి? అని ప్ర‌శ్నిస్తే.. నేను స్వ‌త‌హాగా ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ సిరీస్‌ కి అభిమానిని. డిస్నీ సినిమాల స్ఫూర్తితో ఏదైనా జంతువుతో సినిమా చేయాలనుకున్నాను. విదేశాల్లో పందితో - ఈగ‌తో సినిమా తీశారు కానీ, మ‌న దేశంలో ఎవ‌రూ చేయ‌లేదు. అందుకే పందిపిల్ల‌తో సినిమా చేశాను... అన్నారు.

అదుగో క‌థా చ‌ర్చ‌ల గురించి మాట్లాడుతూ.. నేను నా సినిమా సంగ‌తులు ఎవ‌రితోనూ షేర్ చేసుకోను. ఎవ‌రితోనూ ఎక్కువ క‌ల‌వ‌ను. నా సినిమాల‌న్నిటికీ స‌త్యానంద్ ర‌చ‌యిత‌. ఈ సినిమా లైన్ సురేష్‌ బాబుకు వినిపించి స‌త్యానంద్ గారితో క‌లిసి అభివృద్ధి చేశాను. నాకు ఒక అసిస్టెంట్‌.. వాళ్ల‌తో చిన్న క్రూ క‌లిసి ప‌ని చేశాం అని ర‌విబాబు తెలిపారు. మూడేళ్లు ప‌ట్టింది క‌దా..? అన్న ప్ర‌శ్న‌కు... మ‌న‌కున్న స‌మ‌యం - బ‌డ్జెట్ - టెక్నాల‌జీ ప‌రిమితుల దృష్ట్యా.. చాలా స‌మ‌యం ప‌ట్టింది. తొలుత యానిమ్యాట్రిక్స్ కోసం ప్ర‌య‌త్నిస్తే ర‌జ‌నీకాంత్ బ‌డ్జెట్ అంత అయ్యింది. అందుకే ఆ ప్ర‌య‌త్నం వ‌దిలేసి - త్రీడీ యానిమేష‌న్‌ లోనే ప్ర‌య‌త్నించాం. పందిని యానిమేష‌న్స్‌ లో సృష్టించాం. నిర్మాణానంత‌ర ప‌నుల‌కే ఏడాది ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు రిలీజ్ చేస్తున్నాం.. ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నా... అని ర‌విబాబు అన్నారు. పందిపిల్ల‌ పాత్ర‌కు డ‌బ్బింగ్ కోసం హీరోల్ని అడ‌గాలంటే సిగ్గేసింది. ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎవ‌రో ఒక‌రు చెప్పాలి క‌దా..అందుక‌ని కామిక్ ట‌చ్ ఉన్న రాజేంద్ర ప్ర‌సాద్ గారిని అడిగాను. వెరైటీగా ఉంటుంద‌ని ఒప్పించాను. బంటీ తండ్రి పాత్ర‌కు ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పారని వెల్ల‌డంచారు. పెద్దాళ్ల మాట విన‌ని పంది పిల్ల ను ఈనెల 7వ తేదీన పెద్ద‌తెర‌పై చూడ‌మ‌ని అన్నారు