Begin typing your search above and press return to search.

మగాళ్లకూ కాస్టింగ్ కౌచ్

By:  Tupaki Desk   |   26 May 2018 12:36 PM IST
మగాళ్లకూ కాస్టింగ్ కౌచ్
X
అల్లు అర్జున్ రేస్ గుర్రంతో విలన్ గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న రవి కిషన్ ఈ మధ్య కనిపించడం తగ్గించాడు కానీ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా అన్ని పరిశ్రమలను కుదిపేస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి రవి కిషన్ ఒక ఇంగ్లీష్ డైలీ కిచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలనాత్మక విషయాలు బయటపెట్టడం చర్చకు దారి తీస్తోంది. పక్కలోకి వస్తేనే అవకాశాలు ఇస్తామనే సంస్కృతి కేవలం అమ్మాయిలకే పరిమితమనుకుంటే పొరపాటని మగాళ్లను కూడా రమ్మనే ప్రబుద్ధులు నారీమణులు పరిశ్రమలో ఉన్నారని కొత్త సంగతి చెప్పాడు. కానీ అలా చేస్తేనే ఇక్కడ నిలదొక్కుకుంటాం అనుకుంటే మాత్రం అంత కన్నా దిగజారుడుతనం మరొకటి లేదని స్పష్టం చేసాడు. అలా చేస్తే శారీరకంగానే కాక మానసికంగా కూడా వ్యభిచారం చేసినట్టే అని నొక్కి చెప్పాడు. అవకాశాల కోసం దిగజారితే గుర్తింపు వచ్చే సంగతి ఏమో కానీ ఇంకా చులకనగా చూడటం మొదలు పెడతారని చెప్పాడు.

సౌత్ సినిమాల్లో ప్రతి నాయకుడిగా మంచి పేరున్న ఈ భోజ్ పూరి హీరో చెప్పిన మాటలు కొట్టిపారేయడానికి లేదు. పరిశ్రమలో సీనియర్ నటుడిగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసుంటాడు కాబట్టి ఆ అనుభవాన్ని బట్టే చెప్పి ఉంటాడు. ప్రస్తుతం రవి కిషన్ తెలుగులో కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ తో పాటు కంగనా రౌనత్ టైటిల్ పాత్ర పోషిస్తున్న మణికర్ణికలో చాలా కీలకమైన రోల్ చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. జనవరిలో విడుదల కానున్న ఈ మూవీ తనకు మరో పెద్ద బ్రేక్ అవుతుందని దీనితో బాలీవుడ్ లో కూడా పాగా వేయొచ్చని రవి కిషన్ ప్లాన్ లో ఉన్నాడు. గతంలో కొన్ని హిందీ సినిమాలు చేసాడు కానీ అవేవి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. తెలుగులో మంచి డిమాండ్ లో ఉన్న రవి కిషన్ చెప్పిన మాటలను బట్టి కాస్టింగ్ కౌచ్ భూతం ఎంత పాతుకుపోయిందో అర్థమవుతోంది. మరి రవి కిషన్ మాటలకు స్పందనగా ఇంకా ఎవరూ కామెంట్స్ చేయలేదు.