Begin typing your search above and press return to search.

'టైగర్ నాగేశ్వరరావు'గా రవితేజ .. బెల్లంకొండ వెనక్కితగ్గేనా?

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:27 AM GMT
టైగర్ నాగేశ్వరరావుగా రవితేజ .. బెల్లంకొండ వెనక్కితగ్గేనా?
X
మొదటి నుంచి రవితేజ దూకుడుగానే తన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. నెక్స్ట్ ఏంటి? అన్నట్టుగానే ఆయన తన స్పీడ్ చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడూ తన సినిమాలు .. వాటిని పూర్తిచేసే ప్రణాళికలను గురించి తప్ప మరి దేని గురించి ఆలోచన చేయని హీరోగా ఇండస్ట్రీలో రవితేజకి పేరుంది. యంగ్ హీరోలు కూడా ఆయనతో పోటీపడలేకపోతున్నారు. సెకండ్ వేవ్ తరువాత రవితేజ తన జూలును మరింతగా విదల్చడం విశేషం. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది.

ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే ఆయన 'రామారావు ఆన్ డ్యూటీ' .. 'ధమాకా' సినిమాలను లైన్లో పెట్టేశాడు. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే చాలావరకూ పూర్తయింది. ఇక నక్కిన త్రినాథరావు దర్శకత్వంలోని 'ధమాకా' ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలోనే రవితేజ మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా పేరే 'టైగర్ నాగేశ్వరరావు'. ఒకప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఇటు జనానికీ .. అటు పోలీస్ వారికి కంటిపై కునుకు లేకుండా చేసిన స్టూవర్టుపురం గజదొంగ అతను. ఆయన కథతోనే ఈ సినిమా రూపొందనుంది.

గతంలో 'దొంగాట' .. 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' సినిమాలు చేసిన వంశీకృష్ణ ఆకెళ్ల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించనున్నాడు. హీరోగా రవితేజకు ఇది 50వ సినిమా కావడం .. ఆయన కెరియర్లో ఇది ఫస్టు పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది .. ఇదే గజదొంగ కథతో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'స్టూవర్ట్ పురం దొంగ' అనే టైటిల్ ను కూడా సెట్ చేసి, ఆ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమాకి కేఎస్ దర్శకత్వం వహించనున్నాడు.

ఇలా 70 .. 80 దశకాల్లో గజదొంగగా గడగడలాడించిన 'టైగర్ నాగేశ్వరరావు' కథను, చెరో వైపు నుంచి ఇద్దరు హీరోలు చేయనుండటం ఆసక్తికరం. టైటిల్స్ .. ట్రీట్మెంట్ వేరైనా మూలకథ ఒకటిగానే ఉంటుంది. అయితే ఈ తరహా పాత్రలో రవితేజ చాలా ఈజ్ తో చేయగలడు. ఆయనను ఆ పాత్రలో చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిని చూపుతారు. బెల్లంకొండ శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్ సెపరేటు. దానిని బట్టి ఆ పాత్ర తీరుతెన్నులు మార్చుకోవలసి ఉంటుంది. మరి ఒకే బయోపిక్ తో రవితేజతో పోటీ పడటానికి బెల్లంకొండ సిద్ధపడతాడా? ఎందుకొచ్చిన గోలరాబాబు అనుకుని వెనక్కి తగ్గుతాడా? అనేది చూడాలి.