Begin typing your search above and press return to search.

బ్రేకుల్లేకుండా రవితేజ ప్లానింగ్

By:  Tupaki Desk   |   18 July 2018 5:10 AM GMT
బ్రేకుల్లేకుండా రవితేజ ప్లానింగ్
X
సుమారు రెండేళ్లు గ్యాప్ తీసుకుని గత ఏడాది రాజా ది గ్రేట్ తో తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడ్డ మాస్ మహారాజా రవితేజకు ఈ ఏడాది సగం పూర్తి కాకుండానే రెండు షాకులు తగిలాయి. టచ్ చేసి చూడు-నేల టికెట్టు రెండు దేనికదే సాటి అనే రీతిలో డిజాస్టర్లుగా మిగలడంతో ఇప్పుడు ఆశలన్నీ అమర్ అక్బర్ ఆంటోనీ మీదే పెట్టుకున్నాడు. శ్రీను వైట్లతో తనకున్న బాండింగ్ కొద్ది కథ మీద నమ్మకంతో అతనికి అవకాశం ఇచ్చిన రవితేజ ఇందులో త్రిపాత్రాభినయం చేస్తున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. కానీ అదేమీ లేదని మరో టాక్ కూడా ఉంది. ఇలియానా హీరోయిన్ గా కం బ్యాక్ ఇస్తున్న ఈ మూవీని నవంబర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ రవితేజతో మరో ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. తమిళ్ బ్లాక్ బస్టర్ తేరి రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో గతంలో ప్లాన్ చేసిన మూవీ ఇది. అనూహ్యంగా పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ కావడంతో ఇది కాస్తా రవితేజ చేతికి వచ్చింది. కానీ గత రెండు మూడు రోజులుగా దీని షూటింగ్ ఆపేస్తారేమో అన్న ప్రచారం గట్టిగానే జరిగింది.

తాజా అప్ డేట్ ప్రకారం ఇది ఆగలేదు. కాకపోతే అమర్ అక్బర్ ఆంటోనీ షూటింగ్ పూర్తయ్యాకే దీని సెట్ లోకి అడుగు పెట్టాలని రవితేజ నిర్ణయించుకోవడంతో అక్టోబర్ లేదా నవంబర్ లో షూటింగ్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారట. రెండూ ఒకే బ్యానర్ కాబట్టి అడ్జస్ట్ మెంట్ పెద్ద సమస్య కాదు.

విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన తేరి రెండేళ్ల క్రితం తెలుగులో డబ్ చేసారు కానీ జనానికి చేరలేదు. సంతోష్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి స్క్రిప్ట్ తో సహా సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. రెండూ ఒకేసారి సెట్స్ మీద పెట్టేసి ఇబ్బంది పడటం కన్నా ఒకదాని తర్వాత ఒకటి అయితే క్వాలిటీ కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసినట్టు తెలిసింది. విక్రమార్కుడు-పవర్ తరహాలో రవితేజని ఇందులో అంతకన్నా పవర్ ఫుల్ గా చూపించే విధంగా ఉంటుందట. అందులో సమంతా చేసిన ఫ్లాష్ బ్యాక్ రోల్ ని కాజల్ కు ఆఫర్ చేసినట్టు సమాచారం. మరో హీరోయిన్ ఖరారు కావాల్సి ఉంది.