Begin typing your search above and press return to search.

ఏం మార్చినా అంతే కద మాస్ రాజా..

By:  Tupaki Desk   |   29 April 2018 1:30 AM GMT
ఏం మార్చినా అంతే కద మాస్ రాజా..
X
టాలీవుడ్ స్టార్ హీరోలు గత కొన్నేళ్లలో చాలా మారారు. రొటీన్ మాస్ మసాలా సినిమాలు వదిలేసి విభిన్నమైన కథలు ట్రై చేస్తున్నారు. ఇంతకుముందు రొడ్డకొట్టుడు సినిమాలు చేసిన రామ్ చరణ్ సైతం ‘ధృవ’.. ‘రంగస్థలం’ లాంటి వైవిధ్యమైన సినిమాల్లో నటించి మంచి విజయాలందుకున్నాడు. ఐతే మాస్ సినిమాలతో ‘మాస్ రాజా’గా పేరు తెచ్చుకున్న రవితేజ మాత్రం మసాలా సినిమాల్ని వదలట్లేదు. ఎప్పుడో ‘ఆటోగ్రాఫ్’.. ‘సారొచ్చారు’ లాంటి భిన్నమైన సినిమాలు ఆడలేదని.. ఇప్పటికే కొత్త కథలంటే భయపడుతున్నాడు. రవితేజ కొత్త సినిమా ‘టచ్ చేసి చూడు’ మాస్ కథతోనే తెరకెక్కింది. అదెంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. అయినా అతడిలో మార్పేమీ కనిపంచడం లేదు. కళ్యాణ్ కృష్ణతో చేస్తున్న ‘నేల టిక్కెట్టు’.. శ్రీను వైట్లతో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా రొటీన్ సినిమాల్లాగే కనిపిస్తున్నాయి.

వీటి తర్వాత మాస్ రాజా.. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసింది. ఇది తమిళ హిట్ మూవీ ‘తెరి’కి రీమేక్ అని ముందు నుంచి ప్రచారంలో ఉంది. దీనిపై చిత్ర బృందం తాజాగా ఒక క్లారిటీ ఇచ్చింది. ‘తెరి’ని ఉన్నదున్నట్లు తీయట్లేదని.. లైన్ మాత్రమే తీసుకుని మిగతా సెటప్ అంతా మార్చేస్తున్నామని మీడియాకు లీకులిచ్చింది. ఐతే ‘తెరి’ లైన్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తెలుగులో ‘పోలీస్’ పేరుతో విడుదలైంది కూడా. రెండు దశాబ్దాల కిందట వచ్చిన ‘బాషా’ లైన్లో నడుస్తుందీ కథ. ఆ స్టయిల్లో తెలుగులో లెక్కలేనన్ని సినిమాలొచ్చాయి. అందుకే ‘తెరి’ తమిళంలో ఎంత పెద్ద హిట్టయినా.. తెలుగు వెర్షన్ ఆడలేదు. సంతోష్ శ్రీనివాస్ అండ్ టీం ఎంతగా మార్పులు చేసినా మూల కథ అదే అయినప్పుడు జనాలు రొటీన్ గానే ఫీలవుతారు.