Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా స్థాయిలో రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'

By:  Tupaki Desk   |   3 Nov 2021 7:44 AM GMT
పాన్ ఇండియా స్థాయిలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు
X
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో రేపు దీపావళి పండుగను పురస్కరించుకుని తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. 'దొంగాట' ఫేమ్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ''టైగర్‌ నాగేశ్వరరావు'' అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు.

'టైగర్‌ నాగేశ్వరరావు' చిత్రాన్ని తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అభిషేక్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. 'అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్‌ నాగేశ్వరరావు కూడా ఉన్నారు' అని చిత్ర బృందం ట్వీట్ చేసింది.

‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన ''టైగర్‌ నాగేశ్వరరావు'' అనౌన్స్ మెంట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. కాలికి కడియం పెట్టుకొని రవితేజ విభిన్నమైన గెటప్ లో రా అండ్ రస్టిక్ గా కనిపిస్తారని హింట్ ఇస్తోంది. అలానే అతను రైలు దొంగతనానికి వెళ్తున్నట్లు తెలియజేస్తోంది. అన్ని భాషల్లోనూ ఒకే టైటిల్ ని ఫిక్స్ చేశారు. 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. ‘టైగర్‌’ అనే పేరుతో ప్రసిద్ధి చెందారు.

70వ దశకంలో మోస్ట్ వాంటెడ్ నాగేశ్వరరావు పోలీసులను ముచ్చెమటలు పట్టించాడు. పోలీసులు మరియు జైలు నుండి చాకచక్యంగా తప్పించుకోవడంలో ఆరితేరిన తెలివైన దొంగ టైగర్. ఒకానొక సమయంలో చెన్నై జైలు నుంచి తప్పించుకున్న నాగేశ్వరరావు ను 1987లో పోలీసులు కాల్చి చంపారు. స్టువర్టుపురంలోని అతని ఇంటి ప్రధాన తలుపు వద్ద నాగేశ్వరరావు ఫోటో ఇప్పటికీ వేలాడుతూ ఉంటుంది. అలాంటి దొంగ జీవితంలోని సంఘటన ఆధారంగా ''టైగర్‌ నాగేశ్వరరావు'' సినిమా రూపొందుతోంది.

'టైగర్ నాగేశ్వరరావు' రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మధే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ రాస్తుండగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. 'దిల్ బేచరా' డైరెక్టర్ ముఖేష్ చబ్రా ఈ సినిమా టెక్నికల్ టీమ్ లో భాగం అవుతున్నారు. హీరోయిన్ తో పాటుగా ఇతర నటీనటుల వివరాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనుంది.