Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో పోటీ అనేసరికి టెన్షన్ పడిపోయాను!

By:  Tupaki Desk   |   7 Jun 2022 1:30 AM GMT
త్రివిక్రమ్ తో పోటీ అనేసరికి టెన్షన్ పడిపోయాను!
X
అనిల్ రావిపూడి అనగానే ఆయన సినిమాల్లో కావాల్సినంత ఫన్ ఉంటుందనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఆయన సినిమాలకి వెళితే హాయిగా నవ్వుకోవచ్చనే నమ్మకం ఏర్పడింది. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో పాల్గొన్న ఆయన, తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ .. " ఇంతవరకూ నేను చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. ఒకదానికి ఒకటి సంబంధం లేని కథలే. ఆ తరువాత చేసే సినిమా పూర్తిస్థాయి కామెడీతో ఉండదు. బాలయ్యతో చేయబోయే ఆ సినిమా పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది.

బాలకృష్ణ గారితో చేయబోయే సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుంది. అది పూర్తిగా యాక్షన్ సినిమా అని చెప్పచ్చు. ఆయన స్ట్రెంత్ .. నా టింజ్ పట్టుకుని వెళతాను. బాలయ్య గారు అనేసరికి చాలామంది భయపడతారు గానీ .. నిజానికి ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.

నేను ఏ ప్రాజెక్టును మొదలెట్టినా ఐదారు నెలల్లో పూర్తి చేసేస్తుంటాను. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను కూడా 6 నెలలోగానే పూర్తి చేయడం జరిగిపోయింది. స్క్రిప్ట్ విషయంలో పూర్తి క్లారిటీతో ఉండటం వలన నా సినిమా షూటింగులు చాలా వేగంగా పూర్తవుతూ ఉంటాయి.

మహేశ్ బాబుగారిని ఒప్పించడం చాలా కష్టమని చాలామంది చెప్పారు. కానీ నేను చేసిన 'రాజా ది గ్రేట్' ఆయన చూశారు. యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా డిజైన్ చేస్తున్నాడని ఆయన అనుకున్నారు. ఎంటర్టైన్ మెంట్ మిస్ కాకపోవడాన్ని ఆయన గమనించారు.

ఇక నేను కథ చెప్పే విధానం .. ఆర్మీ సెటప్ తో కూడిన ఫన్ కూడా ఆయనకి బాగా నచ్చింది. అందువలన ఆయనకి నాపై నమ్మకం కలిగింది .. వెంటనే ఒప్పేసుకున్నారు. కేవలం 45 నిమిషాల సేపు కథ చెప్పగానే తాను చేస్తున్నానని ఆయన మాట ఇచ్చేశారు. 'ఎఫ్ 2' చూశాక నాపై నమ్మకం మరింత పెరిగింది.

సంక్రాంతి పండుగ సందర్భంగా 2020 జనవరి 10వ తేదీన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా విడుదలైంది. ఆ తరువాత రెండు రోజులకే త్రివిక్రమ్ గారి సినిమా 'అల వైకుంఠపురములో' రిలీజ్ అయింది. ఆ సంక్రాంతి ఎప్పటికీ గుర్తుండిపోతుంది .. అంత రెవెన్యూను ఇండస్ట్రీ ఎప్పుడూ చూడలేదు. రెండూ రెండే .. ఇది ఇటు కుమ్మేసింది .. అది అటు కుమ్మేసింది. త్రివిక్రమ్ గారి సినిమాతో పోటీ అనేసరికి కొంచెం టెన్షన్ అనిపించింది .. సహజంగానే కొంచెం భయంగా అనిపించింది. ఏవౌతుందోనని రెండు రోజుల పాటు టెన్షన్ పడ్డాను. అదృష్టం కొద్దీ రెండు సినిమాలు బాగా ఆడటంతో హ్యాపీగా ఫీలయ్యాము" అని చెప్పుకొచ్చాడు.