Begin typing your search above and press return to search.

‘నీకోసం’ అంటున్న మాస్ మహారాజా

By:  Tupaki Desk   |   5 July 2017 7:27 AM GMT
‘నీకోసం’ అంటున్న మాస్ మహారాజా
X
ఎప్పుడూ ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా చేస్తుండే మాస్ మహారాజ రవితేజ సినిమా రిలీజై దాదాపు 20 నెలలైపోయింది. షూటింగుల నుంచి కాస్త గ్యాపు తీసుకుని మళ్లీ తనకు అలవాటయిన స్టయిల్ లోకి వచ్చేశాడు. తన అభిమానులకు డబుల్ మజా ఇవ్వడానికి ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్ - టచ్ చేసి చూడు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయేలోగానే ఫ్యూచర్ ప్రాజెక్టులు కూడా ఓకే చేసే పనిలో ఉన్నాడు.

తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్ గా శ్రీను వైట్లకు అవకాశం ఇవ్వడం ద్వారా అతడి కెరీర్ కు బూస్టప్ ఇచ్చేందుకు రవితేజ ఆలోచిస్తున్నాడని ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం శ్రీను వైట్ల టైం అస్సలు బాలేదు. వరసగా మూడు సినిమాలు ఫ్లాపవడంతో అతడికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కనీసం యంగ్ హీరోలు కూడా ఇందుకు అంగీకరించడం లేదు. తాను హీరోగా నిలదిక్కుకోవడానికి కారణమైన శ్రీను వైట్లకు ఈ సమయంలో సపోర్ట్ ఇవ్వాలన్నది రవితేజ ఆలోచన. ఎందుకంటే ‘నీకోసం’ సినిమాతో రవితేజకు సోలో హీరోగా మొదటి అవకాశం ఇచ్చింది శ్రీను వైట్లయే. తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ సినిమా మాస్ లో రవితేజకు తిరుగులేని ఇమేజ్ తెచ్చింది. అతడిని మాస్ మహారాజాగా మార్చింది.

శ్రీను వైట్లకు హిట్ సినిమా ఇవ్వడం ద్వారా అతడిని మళ్లీ ఇండస్ట్రీలో నిలబెట్టాలని రవితేజ అనుకుంటున్నాడట. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ ను వెతికే బాధ్యతను కూడా రవితేజ తన భుజానే వేసుకున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించి ఏదోలా ఈ ప్రాజెక్టు గనుక పట్టాలెక్కితే శ్రీను వైట్ల కెరీర్ కు మళ్లీ భరోసా లభించినట్టే.