Begin typing your search above and press return to search.

ఈ పాట్లు అవసరమా మాస్ రాజా?

By:  Tupaki Desk   |   7 March 2016 7:30 AM GMT
ఈ పాట్లు అవసరమా మాస్ రాజా?
X
ఒక్కో హీరో మీద ఒక్కో రకమైన అంచనాలుంటాయి ప్రేక్షకులకు. పవన్ కళ్యాణ్‌ కు వ్యక్తిగతంగా సీరియస్ సబ్జెక్టులు బాగా ఇష్టం అంటారు. ఆ ఇష్టంతోనే జానీ - పులి లాంటి సినిమాలు చేశాడు. కానీ జనాలకు నచ్చలేదు. ఆ సినిమాలు బాలేకపోవడంతో పాటు పవన్ ను అంత సీరియస్ గా చూడ్డం జనాలకు నచ్చలేదు. ఇక హీరోగా మారిన సునీల్.. రెగ్యులర్ కమర్షియల్ హీరోల్లాగా వేషాలు వేసినా జనాలు అలాగే తిరస్కరించారు. ఇలా ఏ హీరో ఏం చేస్తే బాగుంటుందనే విషయంలో జనాలకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాటిని ఆయా హీరోలు అర్థం చేసుకుని సినిమాలు చేయాలి. మాస్ రాజా రవితేజ విషయానికి వస్తే.. అతను సీరియస్ పాత్రలు వేసినా కూడా జనాలకు అంతగా నచ్చదు. నా ఆటోగ్రాఫ్ - శంభో శివ శంభో లాంటి సినిమాలే అందుకు ఉదాహరణ.

సీరియస్ వేషాలే నప్పనపుడు ఇక సిక్స్ ప్యాక్‌ లు చేస్తే మాత్రం జనాలు పడిపోతారా? రవితేజ లాంటి వాడు సాదాసీదాగా కనిపించి అల్లరి చేస్తేనే అందం. ఆ తరహా పాత్రలే జనాలకు కిక్కిస్తాయి. అలా కాకుండా కండలు పెంచేసి.. సిక్స్ ప్యాకులు పేర్చుకుని వచ్చేస్తే జనాలకు ఏదోలా అనిపించడం ఖాయం. ఇప్పటికే అవసరానికి మించి బరువు తగ్గిపోయి తన ఒరిజినల్ లుక్ కు దూరమైపోయాడు మాస్ రాజా. మళ్లీ బరువు పెరిగి ఒకప్పటిలా తయారైతే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపించాయి. మరి ఆ ప్రయత్నాలేవో చేస్తాడనుకుంటే సడెన్ గా ఈ సిక్స్ ప్యాక్ బాడీతో షాకిచ్చాడు. ప్యాకులైతే బాగున్నాయి కానీ.. దీని వల్ల రవితేజ ముఖంలో మరింత తేడా వచ్చేసినట్లు కనిపిస్తోంది. అసలు ఇంత కష్టపడి పెంచే సిక్స్ ప్యాక్ ల వల్ల సినిమాకు ఎంత వరకు లాభం అనేది ఆలోచించాలి. ఇలా ఇంతకుముందు చాలామంది హీరోలు ప్యాక్ లు పెంచినా ఏ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మాస్ రాజాకు కూడా ఈ మోజు పుట్టి.. చెమటోడ్చాడు. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.