Begin typing your search above and press return to search.

రాజమౌళి కాకుండా .. రవితేజ లేకుండా 'విక్రమార్కుడు 2'?

By:  Tupaki Desk   |   7 Oct 2021 10:30 AM GMT
రాజమౌళి కాకుండా .. రవితేజ లేకుండా విక్రమార్కుడు 2?
X
రవితేజ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'విక్రమార్కుడు' ఒకటిగా కనిపిస్తుంది. మాస్ మహారాజ్ గా రవితేజను నిలబెట్టడంలో ఈ సినిమా పాత్ర కూడా ప్రధానమైనదే. విజయేంద్ర ప్రసాద్ రచించిన కథకు రాజమౌళి దృశ్య రూపం ఇచ్చాడు. రవితేజ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. ఆ తరువాత కూడా రవితేజ ద్విపాత్రాభినయం .. త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు ఉన్నాయి. కానీ 'విక్రమార్కుడు' లెక్కవేరు. ఈ సినిమాలోని రెండు పాత్రల మధ్య గల వైవిధ్యం ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది .. కన్నీళ్లు పెట్టిస్తుంది.

రవితేజ సరసన నాయికగా అనుష్క నటించిన ఈ సినిమా, 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా పాటల పరంగా కూడా దుమ్మురేపేసింది. విడుదలైన ప్రతిప్రాంతంలో వసూళ్ల ప్రవాహం కొనసాగింది. అలాంటి ఈ సినిమాకి వెంటనే సీక్వెల్ చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని ఒక బడా నిర్మాత భావించడంతో, ఆ సీక్వెల్ కి విజయేంద్ర ప్రసాద్ కథను రాశారు. అయితే రాజమౌళి చేసే అవకాశం లేదు .. ఎందుకంటే ఇప్పట్లో ఆయనకు ఖాళీ లేదు.

ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ దగ్గర కథ తీసుకున్న ఆ నిర్మాత, సంపత్ నంది దర్శకత్వంలో 'విక్రమార్కుడు 2' చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టాడని చెప్పుకుంటున్నారు. 'విక్రమార్కుడు 2' కూడా పూర్తిగా మాస్ అంశాలు ఉన్న సినిమా. మాస్ పల్స్ తెలిసిన వినాయక్ .. హరీశ్ శంకర్ .. గోపీచంద్ మలినేని అంతా కూడా ఎవరి ప్రాజెక్టులతో వాళ్లు బిజీగా ఉన్నారు. అందువలన ఆ నిర్మాత సంపత్ నందికి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను అప్పగించినట్టుగా చెబుతున్నారు. గతంలో రవితేజ హీరోగా సంపత్ నంది 'బెంగాల్ టైగర్' సినిమా చేశాడు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. కథాకథనాల పరంగానే కాకుండా పాటల పరంగా కూడా అదరగొట్టేసింది.

అందువలన సంపత్ నంది రంగంలోకి దిగిపోయాడు. రవితేజను ఒప్పించడానికి తనవంతు ప్రయత్నం తాను చేశాడు. కానీ ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడు. ఇటీవలే 'ఖిలాడి' పూర్తి చేసిన ఆయన, 'రామారావు ఆన్ డ్యూటీ' షూటింగులో బిజీగా ఉన్నాడు. ఇక త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. అందువలన ఆయన తనకి కుదరదని చెప్పినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. రాజమౌళి కాకుండా ఆ సీక్వెల్ కి మరొకరు న్యాయం చేయలేరనే ఉద్దేశంతోనే రవితేజ అలా అని ఉండొచ్చని చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఆ బడా నిర్మాత .. సంపత్ నంది ఇద్దరూ కూడా ఈ సిక్వీల్ ను మరో మాస్ హీరోతో రూపొందించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అసలు రాజమౌళి కాకుండా .. రవితేజ లేకుండా చేసేది సీక్వెల్ ఎలా అవుతుంది? అప్పుడు ఆ టైటిల్ ఎలా సెట్ అవుతుంది? అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. అవసరమైతే టైటిల్ మార్చుకుంటారటగానీ, సీక్వెల్ చేయాలనే ఆలోచన మాత్రం మార్చుకోరట. సీక్వెల్ తప్పకుండా ఉంటుందనే అంటున్నారు. ఇక హీరోగా ఎవరు ఎంట్రీ ఇస్తారో, ఎప్పుడు ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తారో చూడాలి.