Begin typing your search above and press return to search.

కృష్ణగాడి ప్రేమగాథకు అది కలిసొచ్చిందా?

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:25 AM GMT
కృష్ణగాడి ప్రేమగాథకు అది కలిసొచ్చిందా?
X
రాయలసీమలో తీసిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో గతంలో చిత్రీకరించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అలరించాయనే చెప్పొచ్చు. వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా! మూవీని ఇదే జిల్లాలోని ముదిగుబ్బ మండలం దొరిగిల్లులో క్లైమాక్స్ ను చిత్రీకరించారు. నిర్మాత డి.సురేష్ బాబు మిత్రుని ఇంట్లో క్లైమాక్స్ ను చిత్రీకరించారు. ఇది కూడా రాయలసీమ ఫ్యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీనే. అప్పట్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. అలాగే ఆ తరువాత వెంకటేష్ - ప్రీతి జింటా జంటగా నటించిన ‘ప్రేమంటే ఇదేరా!’ మూవీ క్లైమాక్స్ ను పరిటాల రవీంద్ర సొంత మండలం రామగిరిలో గాలిమరల ప్రాజెక్టు వద్ద చిత్రీకరించారు. ఈ సినిమా కూడా హిట్టే అయింది. ఆ తరువాత సీతయ్య సినిమాను అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు...పలు ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. ఈ మూవీ హరికృష్ణ కెరీర్లోనే మంచి యాక్షన్ చిత్రంగా నిలబడిపోయింది.

ఇక మోహన్ బాబు ప్రధాన పాత్రలో పరిటాల రవీంద్ర తండ్రి శ్రీరాములయ్య పేరుతో తీసిన మూవీని దాదాపు అనంతపురం జిల్లాలోనే పూర్తి చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తాజాగా విడుదలైన నాని మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మూవీని దాదాపు శ్రీరాములయ్య సినిమాను ఎక్కడైతే చిత్రీకరించారో అదే ప్రాంతంలో మొదటి భాగం మొత్తం చిత్రీకరించారు. రాకెట్ - మోపిడి - ఉరవకొండ - పెనుగొండ - లేపాక్షి తదితర ఊర్లలో బెస్ట్ లొకేషన్స్ ను ఎన్నుకుని ఎంతో రిచ్ గా చిత్రీకరించారు. సాధారణంగా అనంతపురం జిల్లా అనగానే బీడు భూములు... రాళ్లు రప్పలు కనిపిస్తాయి. అలాంటి ప్రాంతాన్ని కూడా ‘కృష్ణగాడి ప్రేమగాథ’కు సూటయ్యేలా చిత్ర యూనిట్ ఎంచుకోవడం వెనుక బహుశా సెంటిమెంటే అనుకోవచ్చు. ఫ్యాక్షన్ గ్రామాలైన రాకెట్ల, మోపిడి గ్రామాల్లో అత్యంత విశాలమైన ఇళ్లు పూర్వం నుంచి వున్నాయి. గతంలో రాకెట్లలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కు చెందిన ఇల్లు సుమారు ఎకరా విస్తీర్ణంలో వుండేది. దాన్ని అప్పట్లో పీపుల్స్ వార్ పేల్చేయడంతో అంతటి విశాలమైన ఇల్లు మరొకటి లేదు. అయితే ఆర్టీసీ బస్సు కూడా అవలీలగా వెళ్లేంత గుమ్మం వున్న గృహాలు రాకెట్ - మోపిడి - ఆముదాల గ్రామాల్లో వున్నాయి. వాటినే ఇప్పటికీ సినిమా షూటింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. శ్రీరాములయ్య చిత్రానికి ఇలాంటి ఇళ్లనే ఉపయోగించారు. కృష్ణగాడి ప్రేమగాథలో కూడా హీరోయిన్ వుండే రాజన్న నివాసం వుండే ఇల్లు కూడా ఇలాంటిదే.

అలా అనంతపురం జిల్లాలో చిత్రీకరించిన సినిమాలన్నీ ఎలాగైతే బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయో.. అదే సెంటిమెంట్ కృష్ణగాడి ప్రేమగాథకు కలిసొచ్చిందని తెలుస్తోంది. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైన అన్నీ స్క్రీన్లలోనూ హౌస్ ఫుల్ తో రన్ అవడం పట్ల చిత్ర యూనిట్ తెగ సంతోష పడుతోంది. మరోసారి నాని రూ.25 కోట్ల మార్కును దాటేయొచ్చని ట్రేడ్ వర్గాలంటున్నాయి. వీకెండ్ తో పాటు... వారం ప్రారంభంలోనూ ఆన్ లైన్లో టిక్కెట్స్ హౌస్ ఫుల్ కావడంతో రాబోవు రోజుల్లోనూ నాని సినిమా భారీ వసూళ్లను చేయడం ఖాయం అంటున్నారు నిర్మాతలు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా ఎంతో రిచ్ గా తెరకెక్కించిన నిర్మాతలు... ఈ సినిమా విజయం కావడంతో గతంలో ఆగడు - 1(నేనొక్కడినే) తెచ్చిన నష్టాల నుంచి గట్టెక్కినట్టే అంటున్నారు.