Begin typing your search above and press return to search.

యాత్ర కోసం నిజం జర్నలిస్టులు!

By:  Tupaki Desk   |   4 Sept 2018 11:51 AM IST
యాత్ర కోసం నిజం జర్నలిస్టులు!
X
జననేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా రూపొందుతున్న యాత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రజాక్షేమం కోసం ఉద్దేశించిన ఎన్నో పధకాల ద్వారా జనం గుండెల్లో అమరజీవిగా నిలిచిన రాజన్న కథను తెరకెక్కించబోతున్నారు అన్న వార్త వెలువడినప్పటి నుంచి దీని మీద సినిమా ప్రేక్షకులతో పాటు రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇటీవలే విడుదల చేసిన పాటకు భారీ స్పందన దక్కింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి మంచి ప్రశంశలు అందుతున్నాయి. దాని తోడు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్ ఆర్ గా నటించడం కూడా బాగా ప్లస్ అవుతోంది. గెటప్ పరంగా లుక్స్ పరంగా మమ్ముట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇకపోతే దీనికి సంబంధించిన విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం ఆసక్తి రేపుతోంది.

యాత్ర డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో అత్యంత కీలక మలుపుగా భావించే పాదయాత్ర థీమ్ తో రూపొందుతోంది. ఆ సమయంలో ఆయన ఎదుర్కున్న ఇబ్బందులు అవమానాలు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు దక్కిన అపూర్వ ఆదరణ సమస్యలను దగ్గరుండి పరిశీలించిన తీరు ఇవన్నీ ఇందులో కూలంకుశంగా చూపించబోతున్నారు. అలాగే రాజన్న పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయనకు మీడియా కూడా అండగా నిలిచింది. గొప్ప సంకల్పంతో ఆయన ప్రయాణం కొనసాగించిన తీరుని అతి దగ్గరి నుంచి పరిశీలించి ఆయనతో సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టులు ఉన్నారు. యాత్రలో అలాంటి కొందరిని నిజంగానే తీసుకొచ్చి సినిమాలో నటింపజేశారట. ఇది ఇటీవలే విడుదల చేసిన వర్కింగ్ స్టిల్స్ చూసాక బయటపడిన సంగతి. ఇది నిజంగా మంచి ఆలోచన అనే చెప్పాలి. షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి దాన్ని బట్టి విడుదల తేదీ ప్రకటించే ఆలోచనలో ఉంది టీమ్.