Begin typing your search above and press return to search.

సిరివెన్నెల మరణం వెనుక అసలు కారణాలు..!

By:  Tupaki Desk   |   1 Dec 2021 4:03 AM GMT
సిరివెన్నెల మరణం వెనుక అసలు కారణాలు..!
X
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో న్యుమోనియాతో పోరాడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. నవంబర్ 24న హాస్పిటల్ లో చేసిన సిరివెన్నెల.. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు చికిత్స అందించిన కిమ్స్‌ హాస్పిటల్ ఎండీ డాక్టర్‌ భాస్కర్‌ రావు సిరివెన్నెల మరణానంతరం మీడియాతో మాట్లాడారు. దిగ్గజ సినీ గీత రచయిత ఆరోగ్య పరిస్థితిని చనిపోవడానికి గల కారణాలను వివరించారు.

''సిరివెన్నెల సీతారామశాస్త్రి గత ఆరేళ్లుగా క్యాన్సర్‌ తో బాధపడుతున్నారు. ఆరేళ్ల క్రితం సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్‌ సర్జరీ కూడా జరిగింది. వారం రోజుల క్రితం మరో వైపు ఊపిరితిత్తుకి క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించాం. దాంట్లో 45 శాతం తొలగించాం. ఆ తర్వాత రెండ్రోజులు ఆయన పరిస్థితి బాగానే ఉంది. మళ్ళీ అస్వస్థతకు గురికావడంతో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ కోసం కిమ్స్‌ కు తీసుకొచ్చారు'' అని డాక్టర్ భాస్కర రావు తెలిపారు.

''కిమ్స్‌ లో ప్రొక్టోస్టోమీ ద్వారా రెండు రోజులు చికిత్స అందిస్తే బాగానే రికవరీ అయ్యారు. ప్రికాస్టమీ కూడా చేశాం. 45 శాతం ఊపిరితిత్తు తీసేశాం కాబట్టి.. మిగిలిన ఊపిరితిత్తుకు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆక్సినేషన్‌ సరిగా లేకపోవడంతో ఎక్మో మిషన్‌ సహాయం అందించాము. గత ఐదు రోజుల నుంచి ఎక్మో మిషన్‌ పైనే ఉన్నారు. క్యాన్సర్‌ - పోస్ట్‌ బైపాస్‌ సర్జరీ - ఒబీస్‌ పేషెంట్‌ కావడం వల్ల కిడ్నీ డ్యామేజ్‌ అయింది. ఆయన శరీరమంతా ఇన్‌ఫెక్షన్‌ సోకింది. దీంతో మంగళవారం సాయంత్రం 4:07 గంటలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి తుదిశ్వాస విడిచారు'' అని కిమ్స్ ఎండీ వివరించారు.

సిరివెన్నెల తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 3000 పైగా పాటలు రచించారు. ఎన్నో అవార్డులు రివార్డులను సొంతం చేసుకున్నారు. 2019లో భారత ప్రభుత్వం సిరివెన్నెలను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. తన కలంతో సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే చిత్రసీమ జీర్ణించుకోలేకపోతుంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని యావత్ సినీ లోకం నివాళులు అర్పిస్తోంది.

సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈరోజు బుధవారం హైదరాబాద్‌ లో జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్ధం సిరివెన్నెల భౌతిక కాయాన్ని ఉదయం 7గంటలకు హైదరాబాద్ ఫిలింనగర్‌ లోని ఫిల్మ్ ఛాంబర్‌ లో ఉంచారు. అనంతరం మహాప్రస్థానంలో మహాకవి అంత్యక్రియలు జరుగుతాయని సిరివెన్నెల కుటుంబ సభ్యులు సమాచారమిచ్చారు.