Begin typing your search above and press return to search.

యువ హీరో వరుస ప్రాజెక్ట్స్ వెనకున్న అసలు రహస్యం అదేనా..?

By:  Tupaki Desk   |   18 July 2022 5:12 AM GMT
యువ హీరో వరుస ప్రాజెక్ట్స్ వెనకున్న అసలు రహస్యం అదేనా..?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న కుర్ర హీరోలలో కిరణ్ అబ్బవరం ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు కిరణ్ చేతిలో అర డజనుకు పైగానే సినిమాలున్నాయి. అందులో నాలుగు సినిమాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. తొలి సినిమా ‘రాజావారు రాణిగారు’ తో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ సాధించాడు. ఈ క్రమంలో వరుస ఆఫర్లు అందుకున్నాడు.

అయితే 'సెబాస్టియన్ PC524' మూవీతో యంగ్ హీరో ఫస్ట్ పరాజయం చవిచూశాడు. ఇక ఇటీవల వచ్చిన 'సమ్మతమే' సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందించలేదు. రెండు బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్స్ వచ్చినా కూడా కిరణ్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.

గీతా ఆర్ట్స్ - మైత్రీ మూవీ మేకర్స్ - మెగా సూర్య మూవీస్ వంటి టాలీవుడ్ లోని పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి. అధికారికంగా ప్రకటించ లేదు కానీ.. ఏషియన్ వారితో ఓ ప్రాజెక్ట్ కమిట్ అయినట్లు సమాచారం.

సాధారణంగా ఏ యువ హీరోకైనా రెండు వరుస ప్లాప్స్ పడితే కెరీర్ స్లో అవుతుంది. కానీ కిరణ్ విషయంలో అలా జరగడం లేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే దీని వెనుక అసలు కారణం వేరే ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

సినిమా హిట్ అయితే హీరోలు రెమ్యునరేషన్ పెంచేయడం.. నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ కిరణ్ అబ్బవరం మాత్రం ఇంత పారితోషకం కావాలని డిమాండ్ చేయడం లేదట.. అడ్వాన్స్ ఇవ్వమని అడగడం లేదట.

సినిమా ఇంత బడ్జెట్ లో కంప్లీట్ చేసి ఇస్తానని ప్రొడ్యూసర్స్ తో ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని కమిట్ మెంట్స్ ఇస్తున్నాడట. ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకూ అన్ని విషయాలు తనే దగ్గరుండి చూసుకునేలా హామీ ఇస్తున్నాడట. ఇలా నిర్మాతలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నాడట.

ఈ నేపథ్యంలోనే కిరణ్ తో సినిమాలు చేయడానికి బడా నిర్మాణ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయని టాక్ నడుస్తోంది. కిరణ్ అడ్వాన్సులు తీసుకోకుండా ఇలా వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవ్వడానికి కారణం.. రెగ్యులర్ గా సినిమాలు విడుదల చేసి ఆడియన్స్ లో ఉండాలననే అంటున్నారు.

అందరూ తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేయాలని.. జనాల్లో తనదైన ముద్ర వేయాలనే ఆలోచనలో భాగంగానే యువ హీరో ఇలా చేస్తున్నాడని చెబుతున్నారు. ఏదేమైనా సినిమా మీద ప్యాషన్ తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి చాలా కష్టపడుతున్నాడని చెప్పాలి.

ఇకపోతే కిరణ్ కు కోలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తెలుగు సినిమాలపైనే పూర్తిగా దృష్టి సారించాలని భావిస్తున్నాడు. వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి కానీ.. ఇప్పుడప్పుడే ఆ దిశగా అడుగులు వేయాలని అనుకోవడం లేదని యువ హీరో చెబుతున్నాడు.

కోడి రామక్రిష్ణ కూతురు కోడి దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమా సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఇదే క్రమంలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ‘రూల్స్ రంజన్’ 'మీటర్' సినిమాలు రానున్నాయి. వచ్చే ఏడాది నాలుగు భాషల్లో ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు కిరణ్ అబ్బావరం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.