Begin typing your search above and press return to search.

విజయ్ అంటే ‘అల్లు’కు ఎందుకిష్టం?

By:  Tupaki Desk   |   29 July 2018 12:17 PM IST
విజయ్ అంటే ‘అల్లు’కు ఎందుకిష్టం?
X
టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలున్నారు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న వారు కొందరే.. అందరికంటే ముందుగా చిరంజీవి ఉంటారు. మెగాస్టార్ స్వశక్తితో విలన్ గా - క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. చివరకు హీరోగా తెలుగు తెర ఇలవేల్పు అయ్యారు. చిరంజీవి స్ఫూర్తిగా ఎంతోమంది తెలుగు తెరకు వచ్చారు. కానీ కొంతమందే నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలను గమనిస్తే ఇద్దరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అందులో ఒకరు నాని కాగా.. మరొకరు విజయ్ దేవరకొండ..

ఈ ఇద్దరిలో విజయ్ దేవరకొండ దూసుకొచ్చిన తీరు అనూహ్యం. చిన్న చిన్న పాత్రలతో ఒక్కో మెట్టు ఎక్కి పెళ్లి చూపులతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేలా ‘అర్జున్ రెడ్డి’ తీశాడు. అందులో విజయ్ నటన ఓ 100 ఏళ్ల పాటు గుర్తు ఉంటుంది. జీవించేశాడనే చెప్పాలి. ఆ పాత్రలో విజయ్ ని చూశాక.. ఏ టాలీవుడ్ హీరో కూడా అంతటా చేయడని అనిపించింది.

ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీతాగోవిందం - టాక్సీవాలా ఫంక్షన్లలో స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అదే మాటన్నారు. విజయ్ లోని నటనకు అసలు కొలమానాలేవీ లేవన్నారు. అల్లు అరవింద్ ఆదినుంచి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారనే పేరుంది. అలా వచ్చిన బావ చిరంజీవి అంటే అల్లు అరవింద్ కు ప్రాణం.. స్వశక్తితో ఎదిగిన వారికి అరవింద్ బాగా గౌరవం ఇస్తాడని ఇండస్ట్రీలో పేరుంది. అంతేకాదు న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఆ కోవలోనే ఇప్పుడు విజయ్ దేవరకొండను బాగా ప్రోత్సహిస్తున్నాడు.

తాజాగా విజయ్ తో ‘గీతాగోవిందం’ అనే మూవీని అల్లు నిర్మించారు. ఇందులో విజయ్ నటనకు ఫిదా అయ్యాడట. వీలైతే అతడితో మరిన్ని సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట.. విజయ్ లాంటి ఒంటరి పక్షులను స్టార్ ప్రొడ్యూసర్ చేయిచ్చి అందలం ఎక్కించడం గొప్ప విషయం అని ఇండస్ట్రీలో మెచ్చుకుంటున్నారు.