Begin typing your search above and press return to search.

దాసరి మరణానికి కారణం అదా..?

By:  Tupaki Desk   |   6 Jun 2017 10:37 AM GMT
దాసరి మరణానికి కారణం అదా..?
X
దర్శకరత్న దాసరి నారాయణరావు ఆర్నెల్ల కిందటి వరకు ఆరోగ్యంగానే కనిపించారు. జనవరిలో ఆయన తన నిర్మాణంలో వచ్చిన ‘అభిషేకం’ సీరియల్ 2500 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ వేడుక కూడా చేశారు. అలాంటిది కొన్ని రోజుల్లోనే ఆసుపత్రి పాలవడం.. ఆరోగ్యం విషమించడం ఏంటో జనాలకు అర్థం కాలేదు. అప్పుడు రెండు నెలల పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకున్న దాసరి.. మళ్లీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఈసారి పరిస్థితి మరింత విషమించి ప్రాణాలే కోల్పోయారు. అసలు దాసరికి ఏమైంది.. ఉన్నట్లుండి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎందుకు విషమించింది అన్నది తెలియ రాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి కుమార్తె హేమాలయ.. తన తండ్రికి అసలేమైందో వివరించింది. ఆయన బరువు తగ్గేందుకు చేసుకున్న సర్జరీ వికటించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందట.

‘‘ఆహారం తక్కువ తినేలా చేసి.. బరువు తగ్గేందుకు తోడ్పడే సర్జరీ ఒకటి నాన్నగారు గత ఏడాది చేయించుకున్నారు. అప్పుడది బాగానే పని చేసింది. ఐతే జనవరిలో రెండోసారి కూడా అలా బెలూన్ వేయించుకొనే సర్జరీకి వెళ్లారు. కానీ మొదటిసారి సర్జరీ చేసిన డాక్టర్‌ ఈసారి లేరు. దీంతో మరో డాక్టర్‌ తో ఆ సర్జరీ చేయించుకున్నారు. ఎక్కడో తేడా వచ్చి.. ఇంటికొచ్చాక అది సీరియస్‌ అయింది. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే... సర్జరీ ఫెయిలైంది.. ఈసోఫ్యాగస్‌ (అన్నవాహిక)లో బెజ్జం పడిందని చెప్పారు. అలాగే ఊపిరితిత్తుల్లో నీరు చేరిపోయింది. అక్కడ నుంచి వరుసగా ప్రొసీజర్ల మీద ప్రొసీజర్లు.. సర్జరీల మీద సర్జరీలు జరిగాయి. ఐతే సీరియస్‌ కండిషన్ నుంచి ఎలాగోలా బయటపడి.. మార్చి 28న ఇంటికొచ్చారు. అప్పట్నుంచి పొట్ట దగ్గర ట్యూబు ద్వారా ద్రవాహారం తీసుకుంటూ కొద్దిగా కోలుకుంటూ వచ్చారు. ఐతే మామూలుగా నోటి ద్వారా తినేలా అన్నవాహికను పునర్నిర్మించేందుకు ఇంకో సర్జరీ చేయించుకోవాలనుకున్నారు. దాని కోసమే మే మూడో వారంలో ఆసుపత్రిలో చేరారు. అప్పుడు పెద్ద పేగును కట్‌ చేసి.. కృత్రిమంగా అన్నవాహికను నిర్మించే సర్జరీ చేశారు. తీరా అది ఫెయిలైంది. అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. జరగరానిది జరిగిపోయింది’’ అని హేమాలయ వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/