Begin typing your search above and press return to search.

దేవిశ్రీ.. బాలీవుడ్ ఎందుకు వెళ్లడంటే?

By:  Tupaki Desk   |   9 Aug 2017 6:13 AM GMT
దేవిశ్రీ.. బాలీవుడ్ ఎందుకు వెళ్లడంటే?
X
దేవిశ్రీ ప్రసాద్ తెలుగులో కంపోజ్ చేసి.. ‘రింగ రింగా’.. ‘అ అంటే అమలాపురం’ పాటల్ని బాలీవుడ్ వాళ్లు ఎంతో ఇష్టపడి తమ సినిమాల్లో పెట్టుకున్నారు. అతడి పాటలపై అంత ఆసక్తి చూపించిన వాళ్లు.. అతణ్ని తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలని అనుకోరా? మరి దేవిశ్రీ ఎందుకు బాలీవుడ్ వెళ్లట్లేదు? అతడికి అక్కణ్నుంచి అవకాశాలు రావట్లేదా? సౌత్ లో ఇటు తెలుగులో.. అటు తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగిన దేవి.. బాలీవుడ్ మీద ఎందుకు దృష్టిపెట్టట్లేదు? ఇవే ప్రశ్నల్ని దేవి ముందు పెడితే అతను ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. తాను బాలీవుడ్ వెళ్లే అవకాశమే లేదని ఒక్క మాటలో తేల్చేశాడు. అందుకతను ఏం కారణాలు చెప్పాడంటే..

‘‘బాలీవుడ్ నుంచి నాకు అవకాశాలు రాకేం కాదు. దాదాపుగా ప్రతి రోజూ అక్కడి నుంచి పిలుపులు వస్తూనే ఉంటాయి. కాకపోతే సమస్య ఏంటంటే.. అక్కడ ఒక సినిమాకు ఒకే సంగీత దర్శకుడు పని చేయరు. ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ ఒక పాట చేస్తుంటాడు. కానీ నాకది నచ్చదు. నేను కథ వినగానే ఆ సినిమాలో లీనమైపోతా. దానికి తగ్గ పాటలు.. నేపథ్య సంగీతం కోసం ప్రాణం పెట్టి పని చేస్తా. వేర్వేరు సంగీత దర్శకులు పని చేస్తే సినిమా మూడ్ కు తగ్గ సంగీతం రాదని నా ఫీలింగ్. అందుకే బాలీవుడ్ వాళ్లు ఒక పాట చేసి పెట్టమని అంటుంటే ఒప్పుకోను. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్లది. నాకైతే ఆ స్కూల్ పడదు. ఒకటీ అరా పాటలకు పని చేయడం ఇష్టం లేకే బాలీవుడ్ సినిమాలు ఒప్పుకోవట్లేదు. డబ్బు కోసం మ్యూజిక్ చేయడం నా లక్ష్యం కాదు. నా పనిని ఆస్వాదిస్తూ చేయడం నాకిష్టం’’ అని దేవిశ్రీ ప్రసాద్ స్పష్టం చేశాడు.