Begin typing your search above and press return to search.

'మాస్ట్రో' మనసు మార్చుకోడానికి కారణమేంటో..!

By:  Tupaki Desk   |   24 Aug 2021 9:30 AM GMT
మాస్ట్రో మనసు మార్చుకోడానికి కారణమేంటో..!
X
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''మాస్ట్రో''. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా.. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు ఈ చిత్రాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీకి అమ్మేశారు. అయితే నితిన్ కెరీర్ లో వస్తున్న ఈ 30వ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం మీద క్లారిటీ రావడం లేదు.

'మాస్ట్రో' చిత్రాన్ని వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఓటీటీలో స్ట్రీమింగ్ పెడతారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందరూ 'ట‌క్ జ‌గ‌దీష్' రిలీజ్ ఇష్యూ మీద కాన్స‌న్ట్రేట్ చేస్తుండ‌టంతో.. సైలెంట్ గా నితిన్ సినిమాని విడుద‌లకి రెడీ చేశారు. లేటెస్టుగా రిలీజైన 'మాస్ట్రో' ట్రైలర్ లో సెప్టెంబరు 9న ప్రీమియర్స్ అని పేర్కొన్నారు. అయితే అంతలోనే ఏమైందో ఏమో ముందుగా విడుదల చేసిన ట్రైలర్ ను యూట్యూబ్ నుంచి డిలీట్ చేసి.. మరోసారి పోస్ట్ చేసారు.

ఈసారి వదిలిన 'మాస్ట్రో' ట్రైలర్ లో రిలీజ్ డేట్ లేదు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మాత్రమే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని నిమిషాల్లోనే విడుదల తేదీ విషయంలో వెనక్కి తగ్గడానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది. 'టక్ జగదీశ్' చిత్రాన్ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తామని ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ అదే రోజున వచ్చినా వేర్వేరు ఓటీటీలలో ఒకేరోజు రెండు మూడు క్రేజీ మూవీస్ స్ట్రీమింగ్ అవ్వడం అనేది సాధారణం. మరి మాస్త్రో ఎందుకు మనసు మార్చుకున్నదనేది ప్రశ్నార్థకంగా మారింది.

'మాస్ట్రో' 'టక్ జగదీష్' సినిమాలు ఓటీటీలకు వెళ్తున్నాయనే వార్తలు వచ్చినప్పుడే.. అక్టోబర్ 31 వరకు తొందరపడవద్దని థియేటర్ల యజమానులు కోరారు. అయినా సరే ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతుండటం పట్ల ఎగ్జిబిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పండుగ సీజన్లో థియేట్రికల్ రిలీజులకు పోటీగా ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదని తీర్మానించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పుడే స్ట్రీమింగ్ డేట్ ఎందుకులే అని 'మాస్ట్రో' మేకర్స్ వెనక్కి తగ్గి ఉంటారని.. పరిస్థితులను బట్టి తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నితిన్ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేస్తారో లేదో అనే దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.

కాగా, ''మాస్ట్రో'' మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న 'అంధాదున్' చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్ గా రూపొందింది. ఇందులో అంధుడి పాత్రలో నితిన్ కనిపించనున్నారు. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీలక పాత్రలో నటించారు. సీనియర్ న‌రేష్‌ - జిషుసేన్ గుప్తా - శ్రీ‌ముఖి - అన‌న్య‌ - హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ - ర‌చ్చ ర‌వి - మంగ్లీ - శ్రీ‌నివాస్ రెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. జె యువ‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'మాస్ట్రో' ప్రమోషనల్ కంటెంట్ విశేష స్పందన తెచ్చుకుంది. లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలు పెంచేసింది.