Begin typing your search above and press return to search.

నిహారిక.. అందర్లాంటి అమ్మాయి కాదండోయ్

By:  Tupaki Desk   |   26 Oct 2015 10:30 PM GMT
నిహారిక.. అందర్లాంటి అమ్మాయి కాదండోయ్
X
ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరూ నిహారిక నిర్ణయాన్ని గౌరవిస్తాం అంటుండొచ్చు. కానీ వాస్తవానికి ఆ అమ్మాయి సినిమాల్లోకి వస్తా.. హీరోయిన్ అవుతా అంటే.. చాలామంది ‘నో’ అనే అన్నారట. స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ మొన్నో ఇంటర్వ్యూలో గుట్టు విప్పేశాడు. చిరు ఒక్కసారి నో అన్నాక ఎలా మనసు మార్చుకున్నాడు? మెగా ఫ్యామిలీలో మిగతా సభ్యుల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఎలా వచ్చింది? అన్నది ఆసక్తికరం. ఇందుకు నిహారిక మొండి పట్టుదలే కారణం అన్నది మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల సమాచారం.

నిహారిక చిన్నప్పట్నుంచి ఇండిపెండెంట్ గర్ల్. టీనేజీలోనే తన సంపాదన తనే సంపాదించుకోవాలని నిర్ణయించుకుని షార్ట్ ఫిలిమ్స్ అవీ చేసిన అమ్మాయి. అంతే కాదు.. తన తండ్రి నాగబాబు ‘ఆరెంజ్’ సినిమాతో దారుణంగా నష్టపోతే.. ఆ సమయంలో తండ్రిని పాకెట్ మనీ అడక్కుండా కాఫీ షాపులో పని చేసింది కూడా. ఇలా ఎప్పుడూ తన కాళ్లపై తాను నిలబడాలని.. తన ప్యాషన్ ను ఎప్పుడూ వదిలిపెట్టొద్దనే బలమైన అభిప్రాయలున్నాయి ఆ అమ్మాయికి. అందుకే సినీ రంగ ప్రవేశం విషయంలో అభిమానులు అడ్డు చెబుతారని.. ఫ్యామిలీకి చెడ్డపేరు వస్తుందని అభ్యంతరాలు చెప్పినా పట్టు వదల్లేదు నిహారిక. ముందు తండ్రిని పట్టుదలతో ఒప్పించింది. ఆ తర్వాత ఆయన అన్నయ్యను ఒప్పించాడు. ఆపై అందరూ నిహారిక పట్టుదల చూసి.. ఆమె నిర్ణయాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్నారు.

ఇక అభిమానుల అభ్యంతరాల విషయానికొస్తే.. నిహారిక సినీ రంగ ప్రవేశం గురించి ప్రకటన వచ్చాక ఆమె తొలి సినిమాను నిర్మించబోయే మధుర శ్రీధర్ కు బెదిరింపులు కూడా వచ్చాయట. ఆ విషయాన్ని మెగా ఫ్యామిలీ దృష్టికి కూడా తెచ్చారట. ఐతే అభిమానులు ప్రేమతో అలా చేస్తున్నారే తప్ప దురుద్దేశాలేమీ ఉండవని.. వాళ్లను తాము మేనేజ్ చేస్తామని నాగబాబు హామీ ఇచ్చారట. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్, రామ్ చరణ్.. నిహారిక గురించి మీడియాతో మాట్లాడ్డం, తమకేమీ తప్పుగా అనిపించట్లేదని.. ఆమె నిర్ణయాన్ని గౌరవిద్దామని స్టేట్మెంట్లు ఇవ్వడం.. ఇదంతా జరిగింది. వాళ్ల మాటల ద్వారా అభిమానులకు వెళ్లాల్సిన సంకేతాలు వెళ్లాయి. అయినా ఇంకేమైనా అభ్యంతరాలు వస్తే.. మెగా ఫ్యామిలీ తరఫున ఓ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ అంటున్నారట. అదీ సంగతి.