Begin typing your search above and press return to search.

మల్టీప్లెక్సులు పొమ్మన్నాయి.. అందుకే వాయిదా

By:  Tupaki Desk   |   26 April 2019 7:58 AM GMT
మల్టీప్లెక్సులు పొమ్మన్నాయి.. అందుకే వాయిదా
X
యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థకు మరోసారి నిరాశ తప్పలేదు. తన కొత్త సినిమా ‘అర్జున్ సురవరం’ రిలీజ్ విషయంలో అతను పడుతున్న తంటాల గురించి తెలిసిందే. ఈ సినిమాను ప్రేక్షుకుల ముందుకు తేవాలని దాదాపు ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి డేట్లు మారుస్తూ పోతున్నారు. జనాలు ఈ సినిమా వాయిదా వార్తలు విని విని విసుగెత్తిపోయారు. ఐతే మే 1న పక్కాగా రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం - కొన్ని రోజులుగా గట్టిగా ప్రమోషన్లు కూడా చేస్తుండటంతో ఈసారి విడుదల ఖాయం అనుకున్నారు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఆ తేదీని కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. ఈసారి సినిమా వాయిదాకు ‘ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్’ కారణమన్నది స్పష్టం. ఆ విషయంలో ‘అర్జున్ సురవరం’ టీం కూడా దాపరికాలేమీ పాటించలేదు. ఆ సినిమా ప్రభంజనాన్ని తట్టుకోలేకే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఐతే ‘ఎవెంజర్స్’ను చూసి మరీ అంతగా భయపడాలా.. తెలుగు సినిమాలు చూసేవాళ్లు ‘అర్జున్ సురవరం’కు వెళ్లకుండా ఉంటారా అన్న సందేహం రావచ్చు. ఐతే కలెక్షన్లు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే.. అసలు దీనికి మల్టీప్లెక్సుల్లో ఎక్కడా స్క్రీన్లు దక్కే అవకాశం లేకపోవడంతోనే వాయిదా వేయక తప్పని పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. ‘ఎవెంజర్స్’కు ముందు ఒక స్థాయిలో మల్టీప్లెక్సులు స్క్రీన్లు ఇచ్చాయి. కానీ బుకింగ్స్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి మతిపోయింది. స్క్రీన్లు పెంచుకుంటూ పోయారు. టికెట్లు అమ్ముడవుతూ వెళ్లాయి. అలా మల్టీప్లెక్సులన్నీ దాదాపుగా ‘ఎవెంజర్స్’తోనే స్క్రీన్లను నింపేశాయి. వీకెండ్లో నూటికి నూరు శాతం మల్టీప్లెక్సుల్లో బుకింగ్స్ అయిపోయాయి. వీకెండ్ తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేసినా టికెట్లు అమ్ముడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఎవెంజర్స్’ను తీసి ‘అర్జున్ సురవరం’ వేసుకోవడానికి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు అంగీకరించే పరిస్థితి లేదు. ‘ఎవెంజర్స్’కు వంద శాతం ఆక్యుపెన్సీ గ్యారెంటీగా ఉన్నపుడు వేరే సినిమాకు ఆ గ్యారెంటీ లేనపుడు ఎందుకు స్క్రీన్లు ఇస్తారు? మరోవైపు సింగిల్ స్క్రీన్లలో చూస్తే ‘జెర్సీ’ - ‘మజిలీ’ లాంటి సినిమాలు ఇంకా బాగా ఆడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు ఓ మోస్తరుగానే దక్కినా.. మల్టీప్లెక్సుల్లో అవకాశమే లేకపోవడంతో గొడవెందుకని సినిమాను వాయిదా వేసుకున్నారు ‘అర్జున్ సురవరం’ నిర్మాతలు.