Begin typing your search above and press return to search.

ఆలస్యవాసి ఎందుకు అయ్యాడు

By:  Tupaki Desk   |   7 Jan 2018 7:44 AM GMT
ఆలస్యవాసి ఎందుకు అయ్యాడు
X
నిన్న పవన్ ఫాన్స్ బాగా అసహనంతో రగిలిపోయారు అన్నది నిజం. కాని పవన్ కళ్యాణ్ మీద కాదులెండి. అజ్ఞాతవాసి ట్రైలర్ అవుట్ అని పోస్టర్ ఉదయమే వదిలిన హారికా అండ్ హాసిని సంస్థ చెప్పిన టైం కి ట్రైలర్ ని ఆన్ లైన్ లో విడుదల చేయడానికి మాత్రం అంత టైం తీసుకోవడం పట్ల సహజంగానే విమర్శలు వచ్చాయి. అంతకు ముందు రోజు శనివారం పది గంటలకు ట్రైలర్ రావొచ్చు అని చెప్పి- ఉదయం దాని గురించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వకుండా మళ్ళి సాయంత్రానికి పోస్ట్ పోన్ చేసి - 6 గంటలకు మళ్ళి చేయలేక అటు తిప్పి ఇటు తిప్పి చివరికి అర్ధ రాత్రి దాటాక రిలీజ్ చేసారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని లక్షలాది పవన్ ఫాన్స్ ఆన్ లైన్ లో నిద్ర మానుకుని వెయిట్ చేయటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.

నాలుగు రోజుల్లో ఇంత భారీ సినిమా విడుదల పెట్టుకుని కనీసం ట్రైలర్ విడుదల గురించి కనీస శ్రద్ధ పెట్టకపోవడం గురించి ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎడిటింగ్ - సాంకేతిక లోపం అని పైకి చెబుతున్నప్పటికీ మరేదో కారణం ఉందని ఫాన్స్ అనుమానం. ఒక్కసారి డేట్ ప్రకటించాక అంతా ప్రీ ప్లాన్డ్ గా ఉండాలి. అదిగో పులి ఇదుగో తోక తరహాలో పవన్ లాంటి క్రేజీ హీరో విషయంలో ఇలా చేయాల్సింది కాదనే కామెంట్ వస్తోంది. ఒకవేళ ఫలానా టైంకి కుదరదు, రావడం లేదు అని ఒకమాట చెబితే పోయే దానికి ఆగండి - వస్తుంది అని ఊరిస్తూ దాని కోసం గంటల కొద్ది విలువైన సమయాన్ని అభిమానులు ఆన్ లైన్ కోసం ఖర్చు చేయించడాన్ని ఎవరు సమర్ధించలేరు. ఇప్పటికే ఫ్రెంచ్ సినిమా కాపీ అనే పుకారుతో తలబొప్పి కట్టిన హారికా అండ్ హాసిని సంస్థ ట్రైలర్ విషయంలో ప్లానింగ్ తో ఉండి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.