Begin typing your search above and press return to search.

'జెర్సీ' వాయిదా వెన‌క ఇంత జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   14 April 2022 2:38 PM GMT
జెర్సీ వాయిదా వెన‌క ఇంత జ‌రిగిందా?
X
తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచిన చిత్రాల‌పై బాలీవుడ్ హీరోలు క‌న్నేసిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డి చిత్రాలు రీమేక్ చేస్తూ వీటి ద్వారా కెరీర్ కి నూత‌న జ‌వ‌స‌త్వాల‌ని అందిపుచ్చుకుంటున్నారు. అలా తెలుగుల చిత్రాల రీమేక్ ల‌తో హీరోగా బాలీవుడ్ లో మంచి డిమాండ్ ని సొంతం చేసుకున్న హీరో షాహీద్ క‌పూర్‌. తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `అర్జున్ రెడ్డి` ఆధారంగా బాలీవుడ్ లో `క‌బీర్ సింగ్‌` మూవీ రూపొందిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో షాహీద్ క‌పూర్ కెరీర్ మ‌రో కొత్త మ‌లుపు తిరిగింది.

ఈ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి షాహీద్ క‌పూర్ కు హీరోగా మంచి డిమాండ్ ని తెచ్చిపెట్టింది. ఈ మూవీ అందించిన స‌క్సెస్ ఊపులో వున్న షాహీద్ అదే సెంటిమెంట్ తో మ‌రో తెలుగు సూప‌ర్ హిట్ ఫిల్మ్ రీమేక్ లో న‌టించారు. తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన `జెర్సీ` చిత్రాన్ని అదే పేరుతో షాహీద్ క‌పూర్ హీరోగా రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, సేర్య‌దేవ‌ర నాగ‌వంశీ, అమ‌న్ గిల్ ఈ మూవీని నిర్మించారు.

భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని రిలీజ్ డేట్ ని కూడా మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా ట్రైల‌ర్ ని కూడా ఇటీవ‌ల విడుద‌ల చేశారు. గౌత‌మ్ తిన్న‌నూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ స‌డ‌న్ గా ఏప్రిల్ 14 నుంచి 22కు మారిపోయింది. `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రిలీజ్ కార‌ణంగానే ఆ మూవీతో క్లాష్ కావ‌డం ఇష్టం లేకే `జెర్సీ` రిలీజ్ ని వాయిదా వేశార‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపించింది. అదే కార‌ణ‌మ‌ని ప్రేక్ష‌కులు కూడా భావించారు.

అయితే అస‌లు కార‌ణం వేరే వుంద‌ని, `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` రిలీజ్ కార‌ణంగా `జెర్సీ` రిలీజ్ ని వాయిదా వేయ‌లేద‌ని నిర్మాత‌ల‌లో ఒక‌రైన అమ‌న్ గిల్ తాజాగా మీడియాకు వెల్ల‌డించారు. కానీరైట్ వివాదం కార‌ణంగానే ఈ చిత్రాన్ని వాయిదా వేశామ‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. సెల‌వు రోజున సినిమాని విడుద‌ల చేయాల‌ని ముందే నిర్ణ‌యించుకున్నామ‌ని, అయితే సినిమాపై కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు కావ‌డంతో రిలీజ్ చేయ‌లేక వాయిదా వేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పుకొచ్చాడు.

త‌మ‌కు అనుకూలంగా కోర్టు తీర్పు రావ‌డంతో `జెర్సీ` రిలీజ్ కు అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయాయ‌న్నారు. `జెర్సీ` సినిమా క‌థ త‌న‌దేనంటూ రూపేష్ జైస్వాల్ అనే వ్య‌క్తి కోర్టులో కేసు వేశాడు. ఈ క‌థ‌ని అక్ర‌మంగా సొంతం చేసుకుని సినిమా తీశారంటూ కోర్టుని ఆశ్ర‌యించాడు. అయితే అత‌ని వాద‌న‌లో ప‌స లేద‌ని గ‌మ‌నించిన న్యాయస్థానం స‌ద‌రు వ్య‌క్తి వేసిన పిటీష‌న్ ని కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీంతో `జెర్సీ` రిలీజ్ కు అడ్డంకులు తొల‌గిపోవ‌డంతో ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నామ‌ని అమ‌న్ గిల్ ప్ర‌క‌టించారు.