Begin typing your search above and press return to search.

రాఘవేంద్రరావు గడ్డం - బీఏ కథ

By:  Tupaki Desk   |   31 Oct 2019 1:30 AM GMT
రాఘవేంద్రరావు గడ్డం - బీఏ కథ
X
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును తలుచుకోగానే ముందు ఆయన గడ్డం గుర్తుకొస్తుంది. చాలా అరుదుగా మాత్రమే ఆయన గడ్డం లేకుండా కనిపిస్తారు. ఇక రాఘవేంద్రరావు సినిమాల్లో దర్శకుడిగా పేరు పడేటపుడు వెనుక ‘బి.ఎ’ అని ఆయన క్వాలిఫికేషన్ పడుతుందన్న సంగతి తెలిసిందే. రాఘవేంద్రరావు కెరీర్ ఆరంభించిన రోజుల్లో అయితే ‘బి.ఎ’ చదవడం గొప్పగా అనిపించి క్వాలిఫికేషన్ వేసుకుని ఉండొచ్చు. కానీ తర్వాతి రోజుల్లో పీజీలు - పీహెచ్ డీలు కామన్ అయిపోయాక కూడా డిగ్రీ క్వాలిఫికేషన్‌ ను పేరు వెనుక వేసుకోవడం విచిత్రమే. ఐతే ఇలా గడ్డం పెంచడం - క్వాలిఫికేషన్ పేరు వెనుక వేసుకోవడం అన్నది తనకు సెంటిమెంటుగా మారడం వల్లే వాటిని కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు రాఘవేంద్రరావు. ఆ సెంటిమెంట్లు ఎలా మొదలయ్యాయో ఓ టీవీ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు.

దర్శకుడిగా తన తొలి సినిమా యావరేజ్‌ గా ఆడిందని.. తర్వాత రెండో సినిమా ‘జ్యోతి’ ప్రారంభం కావడానికి ముందు తిరుపతికి వెళ్లి గడ్డం ఇచ్చేసి అక్కడి నుంచి సినిమా చేయడం మొదులపెట్టానని.. సినిమా పూర్తయ్యే వరకు మధ్యలో ఎక్కడా గడ్డం చేసుకోలేదని.. సినిమా సూపర్ హిట్ కావడంతో గడ్డం సెంటిమెంటుగా మారి దాన్ని కొనసాగించానని.. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్పితే ఎక్కడా తాను గడ్డం తీయించుకోలేదని రాఘవేంద్రరావు చెప్పాడు. ఇక పేరు వెనుక ‘బి.ఎ’ అని వేసుకోవడం గురించి దర్శకేంద్రుడు చెబుతూ.. దర్శకుడు కావడానికి పీయూసీ చదివితే సరిపోతుందని తన తండ్రి చెప్పినప్పటికీ - ఒకవేళ దర్శకుడిగా ఫెయిలైతే ఉద్యోగం కోసం డిగ్రీ ఉండాలనే ఉద్దేశంతో ఎంతో పట్టుదలతో బీఏ చదివానని.. పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ నాలుగైదు సినిమాలకు ‘బి.ఎ’ అని వేశారని.. తర్వాత ఒక సినిమాకు తీసేస్తే అది ఫ్లాప్ అయిందని.. అప్పట్నుంచి తానే పబ్లిసిటీ డిజైనర్లకు పేరు వెనుక తప్పకుండా ‘బి.ఎ’ అని వేయమని చెప్పగా అది సెంటిమెంటుగా మారిపోయిందని చెప్పాడు.