Begin typing your search above and press return to search.

జక్కన్న ట్విట్టర్ కు బై బై చెప్పినట్టేనా..?

By:  Tupaki Desk   |   13 Feb 2019 9:09 AM GMT
జక్కన్న ట్విట్టర్ కు బై బై చెప్పినట్టేనా..?
X
స్టార్ డైరెక్టర్ రాజమౌళి సాధారణంగా ట్విట్టర్లో యాక్టివ్ గా ఉంటారు. కొత్తగా విడుదలైన సినిమాలకు మినీ రివ్యూలు ఇవ్వడం.. ఇతర అంశాలపై స్పందించడం కూడా చేస్తుంటారు. కానీ ఈమధ్య మాత్రం అయన ట్విట్టర్ కు కాస్త దూరంగానే ఉన్నారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై స్పందించలేదు.. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాపై కూడా స్పందించలేదు. ఇంకా చాలా చాలా అంశాలపై స్పందించకుండా ఉన్నారు. దీంతో నెటిజనులు ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు.

రాజమౌళి లాస్ట్ ట్వీట్ డిసెంబర్ 6 న చేసిందే. "నేను వోట్ వేశాను.. మరి మీరు" అంటూ అందరినీ బాధ్యతగా వోట్ వేయాలని అన్నారు. ఈ ట్వీట్ తర్వాత ఇంతవరకూ మరో ట్వీట్ చేయలేదు జక్కన్న. డిసెంబర్ 6 కు ముందు #RRR గురించి.. '2.0' గురించి కూడా ట్విట్టర్లో ప్రస్తావించారు ఆయన. మరి తర్వాత ఏమైంది? ట్విట్టర్ వల్ల తనకు టైమ్ వేస్ట్ అవుతోందని.. ఇప్పుడు అనవసరం అనే ఉద్దేశంతో రాజమౌళి తన ఫోన్ నుంచి ట్విట్టర్ యాప్ ను తొలగించారని సమాచారం. ఎలాగూ #RRR షూట్ తో బిజీగా ఉన్న కారణంగా మళ్ళీ దాని జోలికి వెళ్ళడం లేదట.

ఇది రాజమౌళి అభిమానులను కాస్త నిరాశకు గురిచేసే అంశమే అయినప్పటికీ.. ఆయనకు మాత్రం పెద్ద రిలీఫ్. ఎందుకంటే గతంలో ట్వీట్లు చేస్తే విమర్శలు.. ట్వీట్ చెయ్యకపోయినా విమర్శలు అన్నట్టుగా ఉండేది పరిస్థితి . మొహమాటంతో తనకు కావాలిసినవాళ్ళు తీసిన కొన్ని అత్తెసరు సినిమాలను సూపర్ డూపర్ అంటూ పొగడడంతో నెటిజనులచేత విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా అని స్పందించకుండా ఉంటే.. ఫలానా సినిమాపై స్పందించారు.. ఈ సినిమాకు ఎందుకు స్పందించలేదని విమర్శించారు. ఈ గోలంతా జక్కన్నకు తప్పినట్టేగా!