Begin typing your search above and press return to search.

2.0.. అసలేమైందబ్బా?

By:  Tupaki Desk   |   5 May 2018 12:30 PM GMT
2.0.. అసలేమైందబ్బా?
X
అంతా అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ‘2.0’ సినిమా విడుదలై ఇప్పటికి ఆరు నెలలు అయ్యుండాలి. ముందుగా పోయినేడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత జనవరి 25కు వాయిదా వేశారు. ఆపై ఏప్రిల్ రిలీజ్ అంటూ కొత్త ప్రకటన ఇచ్చారు. ఈ మూడు డేట్లూ దాటిపోయాయి. ఇప్పుడసలు సినిమా ఊసే ఎక్కడా వినిపించట్లేదు. ఏప్రిల్ కాదంటే జూన్ లేదా జులైలో రిలీజ్ ఉంటుందేమో అనుకుంటే అలాంటి సంకేతాలేమీ కనిపించట్లేదు. ‘కాలా’ జూన్‌ కు షెడ్యూల్ అయిందంటేనే ‘2.0’ ఇంకో మూడు నాలుగు నెలల తర్వాత కూడా వచ్చే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఈ చిత్ర విడుదల విషయంలో తీవ్ర అయోమయంలో ఉన్న అభిమానుల్ని ఊరడించడానికి కానీ.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చని సంకేతాలు ఇవ్వడానికి కానీ దర్శక నిర్మాతలు అస్సలు ప్రయత్నించడం లేదు.

ఏప్రిల్ రిలీజ్ అని ప్రకటన ఇచ్చిన వాళ్లు ఆ నెలలో ఈ చిత్రం విడుదల కాదని సమాచారం అధికారికంగా ప్రకటించాలన్న బాధ్యతను కూడా మరిచారు. ఈపాటికే ‘2.0’ను పూర్తి చేసి.. కమల్‌ తో ‘భారతీయుడు-2’ మొదలు పెట్టాల్సి ఉన్న శంకర్.. ఈ ప్రాజెక్టుకే అంకితమై ఉన్నాడు. మామూలుగా ఒక సినిమా రిలీజయ్యాక కానీ వేరే సినిమా వైపు చూడడు శంకర్. అయినా ఏడాది కిందటే షూటింగ్ పూర్తి చేసిన చిత్ర బృందం.. విజువల్ ఎఫెక్ట్స్ ను ఇంత కాలానికి కూడా పూర్తి చేయకపోవడం.. ఇంకో ఆరు నెలల తర్వాత కూడా సినిమాను రిలీజ్ చేసే పరిస్థితిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంతకుముందు ప్రచారం జరిగినట్లు వీఎఫెక్స్ విషయంలో ఒక సంస్థ హ్యాండ్ ఇచ్చినా మరో సంస్థతో పని మొదలుపెట్టినా ఈపాటికి పూర్తవుతుండాలి. మరి ఏం జరుగుతోందో.. సినిమా పరిస్థితి ఏంటో శంకర్ అండ్ కోకే తెలియాలి.