Begin typing your search above and press return to search.

ఇది కోనకు కౌంటరేనా వైట్లా?

By:  Tupaki Desk   |   13 Nov 2018 2:30 PM GMT
ఇది కోనకు కౌంటరేనా వైట్లా?
X
ఒకప్పుడు శ్రీను వైట్లకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. అతడి సినిమా అంటే జనాలు కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు. హీరోలు.. నిర్మాతలు అతడితో సినిమా కోసం లైన్లో నిలిచేవాళ్లు. కానీ కొన్నేళ్లకు పరిస్థితి తల్లకిందులైంది. వైట్ల సినిమాలు జనాలకు మొహం మొత్తేయడం మొదలైంది. ఒకదాని వెంట ఒకటి డిజాస్టర్ సినిమాలు వస్తున్నా.. వైట్లలో మార్పు కనిపించలేదు. ‘ఆగడు’ డిజాస్టరయ్యాక కూడా తన పాత శైలిని విడువకుండా ‘బ్రూస్ లీ’ తీశాడు. అది డిజాస్టర్ అయ్యాక ‘మిస్టర్’ లాంటి రొటీన్ సినిమానే తీశాడు. ఐతే ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’తో తన స్టయిలే మారిపోయిందని అంటున్నాడు వైట్ల. ఇప్పటిదాకా ఎవ్వరూ చేయని జానర్లో ఈ చిత్రం చేసినట్లుగా వైట్ల చెబుతుండటం విశేషం.

‘అమర్ అక్బర్ ఆంటోని’ ట్రైలర్ చూస్తే మాత్రం రొటీన్‌ గానే అనిపించినప్పటికీ వైట్ల మాత్రం ఇందులో చాలా కొత్తదనం ఉంటుందని బలంగా చెబుతున్నాడు. పైగా తన రైటింగ్ టీంతో పాటు సెటప్ అంతా మారిపోయింది కాబట్టి తన నుంచి కొత్తదనం ఆశించవచ్చని వైట్ల చెబుతుండటం విశేషం. ఒకప్పుడు వైట్ల కోన వెంకట్-గోపీ మోహన్ లతోనే వరుసగా సినిమాలు తీశాడు. మధ్యలో ‘ఆగడు’కు వేరే రైటర్లను నమ్ముకున్నప్పటికీ తర్వాతి తిరిగి ‘బ్రూస్ లీ’కి కోన-గోపీ ద్వయంతోనే సినిమా చేశాడు. వాళ్లు రాసిందే అతను తీశాడు. ‘మిస్టర్’కు ఎవరితో పని చేశాడో ఏమో కానీ.. ఇప్పుడు మాత్రం పూర్తిగా కొత్త రైటర్ల తోడ్పాటుతో ‘అమర్ అక్బర్ ఆంటోని’ తీశాడు. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ రైటర్లను జనాలకు పరిచయం చేశాడు కూడా. వాళ్లతో కలిసి చాలా కష్టపడి ‘అమర్ అక్బర్ ఆంటోని’ స్క్రిప్టు రాశానని.. ఉదయం 6 గంటల నుంచి రాత్రి పడుకునే వరకు ఆ రైటర్లు తనతోనే ఉన్నారని.. గోవాలో స్టోరీ సిట్టింగ్ కోసం వెళ్లినపుడు సముద్రంలో స్నానం చేస్తూ కూడా కథ గురించే మాట్లాడుకున్నామని వైట్ల చెప్పడం విశేషం. ఈ రైటర్లందరూ కొత్త వాళ్లని.. కొత్తగా ఆలోచిస్తారని.. ఈ రకంగా తన సెటప్ మారిపోయింది కాబట్టి తన నుంచి కొత్త సినిమాలు ఆశించవచ్చని చెప్పడం ద్వారా ఇంతకుముందున్న రైటర్ల వల్లే తాను రొటీన్ సినిమాలు చేసినట్లు వైట్ల సంకేతాలిస్తున్నట్లా?