Begin typing your search above and press return to search.

ఖాన్ ఇంట దీపావ‌ళి లేదు.. బ‌ర్త్ డే వేడుక‌ల్లేవ్‌.. ఇంత‌కీ ఏమైంది?

By:  Tupaki Desk   |   2 Nov 2022 4:48 AM GMT
ఖాన్ ఇంట దీపావ‌ళి లేదు.. బ‌ర్త్ డే వేడుక‌ల్లేవ్‌.. ఇంత‌కీ ఏమైంది?
X
న‌వంబ‌ర్ 2 .. కింగ్ ఖాన్ షారూక్ పుట్టిన తేదీ. నిజానికి ముంబైలోని ఖాన్ హౌస్ మ‌న్న‌త్ ధేధీప్య‌మానంగా వెలిగిపోవాలి. నెల‌రోజులు ముందుగానే ఇక్క‌డ వేడుక‌లు అంబ‌రాన్ని తాకాల్సి ఉన్నా అది క‌నిపించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. కానీ దానికి కార‌ణం లేక‌పోలేద‌నేది గుస‌గుస‌.

నేటితో ఖాన్ ఒక ఏడాది పెద్ద‌వాడైపోయాడు. చూస్తుండ‌గానే అత‌డు ష‌ష్ఠిపూర్తికి ద‌గ్గ‌ర‌వుతున్నాడు. 60 కి చేరువ‌లో కూడా అత‌డు ఇంకా ఎంతో యాక్టివ్ గా ఒక సామ్రాజ్యాన్ని న‌డిపిస్తున్న తీరు ఆశ్చ‌ర్య‌క‌రం. ఓవైపు న‌ట‌వారసురాలు సుహానా కెరీర్ కోసం త‌పిస్తూనే.. అనూహ్య వివాదాల నుంచి కొడుకు ఆర్య‌న్ ని సంర‌క్షించుకుని ఇప్పుడు అత‌డి కెరీర్ ని చ‌క్క‌దిద్దే ప‌నిలో ఉన్నాడు. ఫ్లాపుల నుంచి బ‌య‌ట‌ప‌డి త‌న రేంజేంటో చూపించే క‌సితోను అత‌డు ప‌ని చేస్తున్నాడు. ఇలాంటి వేళ షారూక్ బ‌ర్త్ డే బాలీవుడ్ వ‌ర్గాలు స‌హా అన్నిచోట్లా హాట్ టాపిక్ గా మారింది.

దీపావళిని..02 నవంబ‌ర్ SRK పుట్టినరోజును.. త‌దుప‌రి నవంబర్ 13న ఆర్యన్ ఖాన్ పుట్టినరోజును ఎందుక‌నో మునుప‌టిలా కాకుండా ఖాన్ ఈసారి నిశ్శ‌బ్ధంగా జ‌రుపుకుంటున్నారు. ఆకాశాన్నంటే సంబ‌రాలు చేయ‌డం లేదు ... అత‌డు కేవ‌లం త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రించేందుకు ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తున్నాడు. ఫ్యాన్స్ మ‌న్న‌త్ ముందు నేడు గుమిగూడి బాద్ షాకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ఈసారి ఖాన్ లు సైలెంట్ గా ఉత్స‌వాలు జరుపుకోవడానికి చాలా కారణాలున్నాయి. పుట్టినరోజు వేడుకలను అత్యుత్సాహంగా నిర్వ‌హించ‌డం లేదు. సాధ్య‌మైనంత స్థ‌బ్ధుగానే కానిచ్చేస్తున్నాడు. ఇంత‌కుముందు దీపావ‌ళి సంద‌డి కూడా పెద్ద‌గా లేదు. వీట‌న్నిటికీ కార‌ణాలు అనేకం. ఆర్య‌న్ అరెస్ట్ వ్య‌వ‌హారం నిజంగానే ఖాన్ ని కంగారు పెట్టింది. అత‌డిని సూప‌ర్ స్టార్ గా తీర్చిదిద్దాల‌ని క‌ల‌లు గంటున్నాడు. కానీ ఆర్య‌న్ మ‌రోవైపు కెమెరా వెన‌క ప‌నుల‌పై ఆస‌క్తిగా ఉన్నాడు. ఇంత‌లోనే కుమార్తె సుహానాను స్టార్ గా చేసేందుకు చాలా ప్ర‌ణాళిక‌ల‌తో ఉన్నాడు.

పుట్టిన‌రోజుల‌కు తన అభిమానులను పలకరించడం కలవడం అనేది ఎప్పుడూ చూసేదే. SRK తన అభిమానులతో కేక్ కటింగ్ సెషన్ కోసం తాజ్ ల్యాండ్స్ ఎండ్ కి వస్తాడు ప్ర‌తిసారీ. మ‌న్న‌త్ లోను అభివాదం చేస్తాడు. తనకు అండగా నిలిచిన తన అభిమానులను అభినందిస్తాడు. ఇవ‌న్నీ రొటీన్. తాజాగా అత‌డు ఫ్యాన్స్ మ‌ద్ధ‌తును కోరుతూ చేరువ‌గా వ‌చ్చిన ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే..షారూఖ్ ఖాన్ చివరిసారిగా ఆనంద్ ఎల్. రాయ్ జీరో (2018)లో కనిపించాడు. కానీ డిజాస్ట‌ర్ ఫ‌లితం నిరాశ‌ప‌రిచింది. సూపర్‌స్టార్ అభిమానులు అతని మాయాజాలాన్ని మళ్లీ తెరపై చూసేందుకు ఊపిరి పీల్చుకుని కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అతనికి 2023లో మూడు విడుదలలు ఉన్నాయి. దీపికా పదుకొణె -జాన్ అబ్రహంతో 2023 జనవరి 25 ప‌ఠాన్ తో దూసుకొస్తున్నాడు. 2 జూన్ 2023న అట్లీ తో పాన్ ఇండియా ప్ర‌యోగం జ‌వాన్ రిలీజ్ కానుంది. నయనతార ఇందులో నాయిక కాగా దీపికా అతిధి పాత్రలో న‌టిస్తోంది. తాప్సీ పన్నుతో డుంకీ చేస్తున్నాడు. రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. 2023డిసెంబర్ 22న ఈ మూవీ విడుద‌ల కానుంది.

57వ పుట్టినరోజు సంద‌ర్భంగా ఖాన్ గ‌తంలోకి వెళితే... 30 సంవత్సరాలకు పైగా హిందీ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషిని మనం రివైండ్ చేసి చూడాలి. ఈ రోజు షారుఖ్ ఖాన్ నటించిన ప‌ఠాన్ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని స‌మాచారం.

షారుఖ్ ఖాన్ కుటుంబం ప్రయాణం..

షారుఖ్ ఖాన్ 1991 లో గౌరీ ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆర్యన్ ఖాన్ - సుహానా ఖాన్- అబ్రామ్ ఖాన్. అనేక సందర్భాల్లో షారుఖ్ ఖాన్ తన కుటుంబంపై తన ప్రేమ ఎలాంటిదో ఆవిష్క‌రించాడు. షారుఖ్ తన కుటుంబంపై చూపుతున్న ప్రేమ భక్తిని అభిమానులు చాలా సంద‌ర్భాల్లో మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి ఆయన రోల్ మోడల్. బాలీవుడ్ బాద్ షాగా సుప్ర‌సిద్ధుడైన అత‌డికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం అతనికి ఆర్డ్రే డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్ .. లెజియన్ ఆఫ్ ఆనర్ లను ప్రదానం చేసింది.

బాజీగర్ (1993)- డర్ (1993)- అంజామ్ (1994)- దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే (1995)- దిల్ తో పాగల్ హై (1997)- కుచ్ కుచ్ హోతా హై (1998)- మొహబ్బతీన్ (2000) వంటి చిత్రాలు SRK కి మంచి పేరు ను తెచ్చాయి.కభీ ఖుషీ కభీ ఘమ్ (2001) అత‌డి కెరీర్ లో ప్ర‌త్యేక‌మైన సినిమా. గ్రేట్ కింగ్ షారుఖ్ ఖాన్ కు 'తుపాకి' త‌ర‌పున‌ పుట్టినరోజు శుభాకాంక్షలు!




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.