Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ని ఎందుకు రిజెక్ట్ చేసారు ?

By:  Tupaki Desk   |   24 Feb 2019 6:57 AM GMT
ఎన్టీఆర్ ని ఎందుకు రిజెక్ట్ చేసారు ?
X
ఏదైనా సినిమా నచ్చకపోతే తటస్థులు దూరంగా ఉండి అభిమానులు ఎంతో కొంత అండగా ఉండి కొంతైనా గట్టెక్కించే ప్రయత్నం చేయడం ఏ స్టార్ హీరో డిజాస్టర్ కైనా సహజంగా జరిగే పరిణామం. అజ్ఞాతవాసి-స్పైడర్-వినయ విధేయ రామలు ఎంత భీకరమైన ఫ్లాపులైనప్పటికి చాలా చోట్ల వీటి పేరు మీద ఫస్ట్ డే రికార్డ్స్ ఉన్నాయన్న మాట అబద్దం కాదు. తర్వాత నెమ్మదించి దెబ్బ తినడం వేరే సంగతి. కాని మహానాయకుడు విషయంలో ఇదంతా రివర్స్ లో కనిపిస్తోంది.

మొదటి రోజు కలెక్షన్ చూసే ట్రేడ్ కు మాటలు ఆగిపోగా అంతకు తీసికట్టుగా రెండో రోజు డ్రాప్ పెరిగిపోవడం చూసి అభిమానులు సైతం ఎన్టీఆర్ బయోపిక్ పట్ల ఎంత అయిష్టంగా ఉన్నారో అర్థమైపోయింది. కథానాయకుడు ముందు వరకు క్రమం తప్పకుండా పోస్టర్లు వదిలినా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా అందరూ మెచ్చేలా ట్రైలర్ కట్ చేసినా ఇవేవి కాపాడలేకపోయాయి. మహానాయకుడు ఫైనల్ రన్ పూర్తయ్యేలోపు వచ్చే కలెక్షన్ ఫిగర్స్ బాలయ్యను లైఫ్ లాంగ్ వెంటాడినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన కెరీర్లో వెరీ బ్యాడ్ మూవీస్ గా చెప్పుకునే పరమవీర చక్ర-విజయేంద్ర వర్మ-వీరభద్ర లాంటివి ఫస్ట్ డే విషయంలో నిరాశ పరచలేదు.

వాటి కంటే ఎన్నో రెట్లు మెరుగైన మహానాయకుడు వెనుకబడటం చూస్తే అసలు ఇలా ఎందుకయ్యిందో కూడా బయ్యర్లకు అంతు చిక్కడం లేదు. కేవలం తమ కుటుంబానికి అనుకూలంగా స్క్రిప్ట్ రాయించుకుని చంద్రబాబుని మంచివాడుగా చూపించారనే టాక్ ముందుగానే బయటికి వెళ్ళిపోవడంతో సహజంగానే ఎన్టీఆర్ వీరాభిమానులు దీనికి దూరంగా ఉన్నట్టు అర్థమవుతోంది. దానికి తోడు రెండో సారి ముఖ్యమంత్రి అయ్యాక జరిగిన అసలైన మలుపులను తమ సౌలభ్యం కోసం వదిలేయడం కూడా నెగటివ్ గా వెళ్ళింది. ఇవన్ని కూడబలుక్కుని చిరకాల జ్ఞాపకంగా బాలయ్యకు మిగలాల్సిన బయోపిక్ ని పీడకలగా మార్చేసిందని విశ్లేషకుల అంచనా