Begin typing your search above and press return to search.

మీడియాపై సీరియస్ అయ్యేంతలా కోలుకున్న రెబల్ స్టార్

By:  Tupaki Desk   |   21 Nov 2019 12:53 PM IST
మీడియాపై సీరియస్ అయ్యేంతలా కోలుకున్న రెబల్ స్టార్
X
రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కోపం వచ్చింది. గోరంతను కొండంతగా చేసి చూపిస్తున్న మీడియా తీరుపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్న విషయానికి మీడియాలో ప్రొజెక్టు అయిన తీరుపై మండిపడుతున్న ఆయన.. తాజాగా తన ఆరోగ్యం మీద పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాజాగా తమ వివాహవార్షికోత్సవం సందర్భంగా గుళ్లో ప్రత్యేక పూజలు.. శతచండీ మహాయాగాన్ని నిర్వహించారు.
అంతేకాదు.. తాను సంపూర్ణంగా కోలుకున్నానని.. ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో తాను బాధ పడ్డానని.. అయితే.. దాన్ని వక్రీకరించి మీడియాలో హడావుడి చేశారన్నారు. తప్పుడు వార్తలు రాయటంపై ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఆరోగ్యంపై మీడియా రాసిన వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేసిన రెబల్ స్టార్.. తన ఆరోగ్యం మీద వార్తలు రాసే సమయంలో తమను సంప్రదించి ఉంటే మరింత వివరంగా చెప్పేవారమన్నారు. ఎవరికైనా సరే.. జలుబు.. దగ్గు.. జ్వరం సాధారణమని.. తనకూ అలాంటి ఇబ్బందే ఎదురైందన్నారు. తన అభిమానులు ఇప్పటికి ఫోన్లు చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారన్నారు. ఏమైతేనేం.. మీడియా తప్పు చేసిందో.. ఒప్పు చేసిందో.. తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఈ వయసులో మరోసారి అర్థమయ్యేలా చేసిందనుకుంటే సరిపోతుందేమో?