Begin typing your search above and press return to search.

పెద్ద దిక్కు కోల్పాయ‌నంటూ ప్ర‌భాస్ క‌న్నీటిప‌ర్యంతం

By:  Tupaki Desk   |   11 Sep 2022 10:36 AM GMT
పెద్ద దిక్కు కోల్పాయ‌నంటూ ప్ర‌భాస్ క‌న్నీటిప‌ర్యంతం
X
డార్లింగ్ ప్ర‌భాస్ కి పెద‌నాన్న కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యం.. అనుబంధం ఎంతో గొప్ప‌వి. ప్ర‌భాస్ ని హీరోగా నిల‌బెట్టిన‌ది.. అత‌డి కెరీర్ ని ఒక్కో మెట్టు తీర్చిదిద్దిన‌ది పెద‌నాన్న కృష్ణంరాజు. నేడు ప్ర‌భాస్ భార‌త‌దేశంలో గొప్ప హీరోల‌లో ఒక‌రు. పాన్ ఇండియా స్టార్ గా ఏల్తున్నారు. రెబ‌ల్ స్టార్ బిరుదునే ఫ్యాన్స్ త‌న‌కు అంకిత‌మిచ్చారు అంటే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఎమోష‌న‌ల్ బాండింగ్ అలాంటిది. నేటి వేకువ‌ఝామున కృష్ణంరాజు గుండెపోటుతో మృతి చెందారని తెలియ‌గానే ప్ర‌భాస్ క‌న్నీరుమున్నీర‌య్యారు. గ‌త నెల‌రోజులుగా పెద‌నాన్న ఆరోగ్య ప‌రిస్థితి క్షీణించింద‌ని తెలియ‌గానే త‌న‌తోనే ఎక్కువ స‌మ‌యం గ‌డిపార‌ని స‌మాచారం. ఇంత‌కుముందే కృష్ణంరాజు చికిత్స పొందుతున్న ఏఐజీ ఆస్ప‌త్రి నుంచి వెళుతూ ప్ర‌భాస్ కెమెరాల‌కు చిక్కాడు. అదే క్ర‌మంలో ఆయ‌న ఆరోగ్యంపై మీడియాలో పెద్ద ఎత్తున‌ క‌థ‌నాలొచ్చాయి.

కృష్ణంరాజు మృతి వార్త తెలియ‌గానే సినీరాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేసారు. ఆయ‌న పార్థీవ దేహాన్ని హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లోని త‌మ‌ ఇంటికి త‌ర‌లించాక సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాదవ్ స‌హా ప‌లువురు టాలీవుడ్ అగ్ర హీరోలు సంద‌ర్శించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్‌- మ‌హేష్- ఎన్టీఆర్- నాని త‌దిత‌రులు ఉన్నారు. మురళీమోహన్- మోహన్ బాబు- దర్శకులు త్రివిక్రమ్- రాఘవేంద్రరావు తదితరులు కృష్ణంరాజుకు నివాళులర్పించారు. అనంత‌రం వీరంతా ప్రభాస్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. మంత్రి త‌ల‌సాని ప్ర‌భాస్ ని క‌ల‌వ‌గానే ఎమోష‌న్ ని ఆపుకోలేక క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యార‌ని తెలిసింది. తాను పెద్ద దిక్కును కోల్పోయాన‌ని ప్ర‌భాస్ బాధ‌ప‌డ‌గా త‌ల‌సాని ఓదార్చారు.

ప్ర‌భాస్ కంట‌త‌డి పెట్టిన ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. ప్ర‌భాస్ తండ్రి గారైన ఉప్ప‌ల‌పాటి సూర్య‌నారాయ‌ణ‌రావు గారు లేని లోటును కొంతైనా తీర్చింది పెద‌నాన్న కృష్ణంరాజు గారు. అందుకే ఇప్పుడు ప్ర‌భాస్ క‌న్నీటిని ఆపుకోలేని స్థితి.

టాలీవుడ్ నటుడు.. కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు అంత్య‌క్రియ‌ల‌ను సోమవారం హైదరాబాద్ లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. గౌర‌వ లాంఛ‌నాల‌తో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ముఖ్యమంత్రి కోరారు.

రెబల్ స్టార్ గా పేరుగాంచిన కృష్ణం రాజు ఆదివారం తెల్లవారుజామున ఇక్కడి ఏఐజీ ఆస్పత్రిలో మరణించారు. ఆయన వయసు 83. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమ సంస్కారాల వివరాలను తెలియజేసే ట్వీట్ ను తెలుగులో తెలంగాణ సీఎంఓ వెరిఫైడ్ ఖాతాలో షేర్ చేశారు. తన ప్రియ మిత్రుడు కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. సీఎస్ సోమేష్ కుమార్ ఏర్పాట్లను పూర్తి చేస్తారు.

ఆయన పార్థివదేహాన్ని ప్ర‌స్తుతం నివాసం వ‌ద్ద‌నే ఉంచారు. అక్కడ ఆయన అభిమానులకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం వరకు ఉంచనున్నారు. ప్ర‌భాస్ ఇంటికి నివాళులర్పించేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు- సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు.