Begin typing your search above and press return to search.

కృష్ణంరాజు తన మరణం ఎలా ఉండాలనుకున్నారంటే..!

By:  Tupaki Desk   |   11 Sep 2022 12:11 PM GMT
కృష్ణంరాజు తన మరణం ఎలా ఉండాలనుకున్నారంటే..!
X
కృష్ణంరాజు పేరు వినగానే తెలుగు తెరపై నిండైన ఆయన రూపం .. గంభీరమైన స్వరం .. ఆకాశం ఎర్రబడిందా అనిపించినట్టుగా ఉండే కళ్లు గుర్తుకు వస్తాయి. కృష్ణంరాజు నటన ఒక ఎత్తయితే .. ఆయన నవ్వు ఒక ఎత్తు. తెలుగు తెరను ఎంతమంది మహానటులు పలకరించిన వెళ్లినా ఆయన నవ్వుకంటూ ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా ప్రత్యేకమే. ఉద్వేగం .. రౌద్రానికి సంబంధించి సన్నివేశాలలో ఆయన తన విశ్వరూపం చూపించేవారు.

ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. ఈ ముగ్గురూ కూడా హీరోగా ఒక స్థాయికి వచ్చిన తరువాత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. కానీ కృష్ణంరాజు అలా కాదు, హీరోగా సరైన బ్రేక్ కోసం చాలా కాలం వెయిట్ చేసిన ఆయన గోపీకృష్ణ మూవీస్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించారు. సొంత నిర్మాణ సంస్థ ద్వారానే కృష్ణంరాజు నిలదొక్కుకున్నారు. అప్పట్లో ఆ బ్యానర్లో ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్. ఆయన సినిమాల్లో పాటలు కూడా బాగుంటాయనే పేరు ఉండేది.

ఇక కృష్ణంరాజు హీరోగా నిలదొక్కుకోవాలనుకునే సమయానికి పోటీ మామూలుగా ఉండేది కాదు. ఒక వైపున ఎన్టీఆర్ - ఏఎన్నార్, మరో వైపున కృష్ణ - శోభన్ బాబు ఎవరి జోనర్ లో వారు దూసుకుపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో తాను నిలదొక్కుకోవాలంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన జోనర్ కావలి. అందుకనే వాళ్లకి భిన్నంగా కృష్ణంరాజు మాస్ యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఎంచుకోవడం మొదలుపెట్టారు. విలేజ్ నేపథ్యంలోని రౌడీయిజంలోనే హీరోయిజం చూపించే పాత్రలకు కృష్ణంరాజు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు.

కృష్ణంరాజు దశాబ్దాల పాటు నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. 'భక్త కన్నప్ప' .. 'త్రిశూలం' .. 'బొబ్బిలి బ్రహ్మన్న' .. 'తాండ్రపాపారాయుడు' .. 'విశ్వనాథనాయకుడు' వంటి సినిమాలు ఆయన కెరియర్లో ప్రత్యేకమైనవిగా కనిపిస్తాయి. పీసీ రెడ్డి .. వి. మధుసూదనరావు .. దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు వంటి దర్శకత్వంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. ఇక ఆయన సరసన నాయికలుగా చాలామంది నటించినప్పటికీ, హిట్ పెయిర్ గా చూసుకుంటే జయసుధ .. జయప్రద .. రాధిక కనిపిస్తారు.

ఇలా నటుడిగా కొన్ని తరాల ప్రేక్షకులను ప్రభావితం చేసిన కృష్ణంరాజు, అభిమానులను వదిలివెళ్లడం విచారించదగిన విషయం. రాజసం నిండిన రూపంతో .. ఆదేశించే స్వరంతో .. శాసించే కళ్లతో నవరసాలను అదిలించి నడిపించే అలాంటి నటుడిని ఇకపై చూడటం కష్టమే. తాను ఒక పచ్చని చెట్టు క్రింద పడుకుని .. ఆకాశం వంక చూస్తూ .. ఎవరికీ ఎప్పుడూ ఎలాంటి అన్యాయం చేయలేదనే గర్వంతో గుండెలపై చేయి వేసుకుని తుది శ్వాస విడవాలనేది తన చివరి కోరిక అని కృష్ణంరాజు కొంతకాలం క్రితం ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన కోరుకున్నట్టుగానే అటు వెండితెరపై .. ఇటు నిజజీవితంలోను మచ్చలేని చంద్రుడిగానే ఆయన మిగిలిపోయారనడంలో ఎలాంటి సందేహం లేదు.