Begin typing your search above and press return to search.

రాజుగారు కూడా ధైర్యాన్ని కోల్పోతున్నారా?

By:  Tupaki Desk   |   19 July 2022 11:30 PM GMT
రాజుగారు కూడా ధైర్యాన్ని కోల్పోతున్నారా?
X
ఆగ‌స్టు 1 నుంచి టాలీవుడ్ నిర్మాత‌లు బంద్ కి స‌న్న‌ధం అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సినిమా నిర్మాణ వ్య‌యం పెరిగిపోవ‌డం.. హీరోల పారితోషికాలు ఆకాశ‌న్నంట‌డం...వాళ్ల‌తో పాటు క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు సైతం రెమ్యున‌రేష‌న్ హైక్ చేయ‌డం.. కార్మికుల‌ వేత‌నాల డిమాండ్...థియేట‌ర్ ఆక్యుపెన్సీ త‌గ్గిపోవ‌డం..ఓటీటీ ఆదర‌ణ పెర‌గ‌డం..ఏపీలో ఆన్ లైన్ టిక్కెట్ విక్ర‌యాల‌ ఇబ్బందుల‌తో ఇండ‌స్ర్టీ స‌త‌మ‌త‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

వీట‌న్నింటికి నిర్మాణం బంద్ చేయ‌డం ఒక్క‌టే ప‌రిష్కారం దిశ‌గా నిర్మాత‌లు ముందుకు క‌దులుతున్నారు. దీని ప్ర‌భావం భ‌విష్య‌త్ లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్ప‌లేం గానీ! కొంత మంది నిర్మాత‌ల్లో మాత్రం ఈ నిర్ణ‌యం తో ఒణుకు పుట్టిస్తున్న‌ట్లే క‌నిపిస్తుంది. తాత్కాలికంగా నిర్మాణానికి బ్రేక్ ప‌డితే మ‌ళ్లీ పునిర్మాణానికి ఎంత కాలం ప‌డుతుందో తెలియ‌దు.

దీంతో చాలా మంది నిర్మాత‌లు సినిమా ప‌రిశ్ర‌మ తాజా ప‌రిస్థితుల్ని ..థియేట‌ర వ్య‌వ‌స్థ‌ల్ని..ఓటీటీ వ‌ల్ల క‌ల్గుతోన్న ఇబ్బందుల్ని విశ్లేషించే ప‌నిలో ప‌డ్డారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అగ్ర నిర్మాత దిల్ రాజు మాట‌ల్లో సైతం ధైర్యం కోల్పోతున్న విధానం క‌నిపిస్తుంది. ఓసారి ఆయ‌న మాట‌ల్ల్లోకి వెళ్తే...`` ఓటీటీల‌తో నిర్మాత‌ల‌కి లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌.

ఓటీటీలో సూప‌ర్ హిట్ అయినా నిర్మాత‌కి వ‌చ్చేదేమి ఉండ‌దు. అదే సినిమా థియేట‌ర్ లో రిలీజ్ అయితే ఎప్ప‌టిక‌ప్పుడు వ‌సూళ్లు పెరుగుతుంటే ఉత్సాహం వేరుగా ఉంటుంది. నిర్మాత‌ల గురించి హీరోలు ఆలోచిస్తున్నారు. అంద‌రు అర్ధం చేసు కుంటార‌నే న‌మ్మ‌క ఉంది. స‌మ‌స్య‌లు అంద‌రికీ అర్ధ‌మ‌య్యేలా చెబితే సరిపోతుంద‌నిపిస్తుంది.

స్టార్ హీరోల సినిమాల‌న్నీ థియేట‌ర్ త‌ర్వాతే ఓటీటీకి వెళ్లాలి..అది కూడా ప‌దివారాల త‌ర్వాతే జ‌ర‌గాల‌ని చ‌ర్చిస్తున్నాం. ప‌రిస్థితుల‌న్ని త్వ‌ర‌లోనే గాడిలో ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం. కోవిడ్ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి. ప్రేక్ష‌కుల ఆలోచ‌న‌ల్లో చాలా మార్పులొచ్చాయి. ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నారు. సినిమాల ప‌రంగా ఆడియ‌న్స్ కి బాగా అవ‌గాహ‌న పెరిగింది.

ఆషామాషీ క‌థ‌లు తీస్తే జ‌నాలు చూడ‌టం లేదు. అలాంటి సినిమా కోసం అంత డ‌బ్బు ఖ‌ర్చు చేయాలా? అని ఆలోచిస్తున్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత‌లంతా అర్ధం చేసుకోవాలి. ఇటీవ‌లే నిర్మాత‌లంతా ఈ విష‌యంపై మాట్లాడుకున్నాం. క‌థ‌లు.. మేకింగ్ శైలితో పాటు నాన్ థియేట్రిక‌ల్..థియేట్రిక‌ల్ లెక్క‌లు మారిపోయాయి. వాటి గురించి ఇంకా బాగా అవగాహ‌న పెంచుకోవాలి.

ప్ర‌తీ సినిమాకి డ‌బ్బు పోతుంద‌ని నిర్మాత‌లు బాధ‌ప‌డుతున్నారు. ఈ సారి సంగ‌తి హీరోల‌కు..ద‌ర్శ‌కుల‌కు కూడా అర్ధ‌మ‌వుతుంది`` అని అన్నారు. ఇంత వ‌ర‌కూ టాలీవుడ్ లో సినిమా నిర్మాణం ఎప్పుడూ బంద్ పెట్ట‌లేదు. తొలిసారి అన్ని కంపెనీలు ఒకే తాటిపైకి వ‌చ్చి బంద్ కి రెడీ అవ్వ‌డంతో స‌న్నివేశం ఒక్క‌సారిగా మారిపోతుంది.

ఒక‌ప్పుడు ఓటీటీ వ‌ల్ల ఇబ్బంది లేద‌ని ధైర్యంగా చెప్పిన‌ వాళ్లు ఇప్పుడు అదే ఓటీటీ త‌మ‌కి సంక‌టంగా మారింద‌ని అదైర్యాన్ని ప్రద‌ర్శించ‌డం గ‌మ‌నించద‌గ్గ విష‌యం. ఓటీటీ ప‌ని ఓటీటీదే..థియేట‌ర్లు ప‌ని థియేట‌ర్ల‌దే! అని అప్ప‌ట్లో చాలా న‌మ్మ‌కాన్ని వ్య‌క్తి చేసి కార్పోరేట్ దిగ్గ‌జాల్ని ఎంతో ప్రోత్స‌హించారు. అదే ఓటీటీ నేడు థియేట‌ర్ ఆక్యుపెన్సీ త‌గ్గించ‌డంలో కీల‌క భూమిక పోషిస్తుంద‌ని తాజాగా వెలుగులోకి వ‌స్తుంది.