Begin typing your search above and press return to search.

ఆ హీరో పద్దతి నచ్చకపోవడంతో ముఖం మీదే చెప్పేశాడట!

By:  Tupaki Desk   |   11 Aug 2021 3:32 AM GMT
ఆ హీరో పద్దతి నచ్చకపోవడంతో ముఖం మీదే చెప్పేశాడట!
X
తెలుగులో హాస్యభరితమైన కథలను తెరకెక్కించడంలో రేలంగి నరసింహారావుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఆయన ప్రయాణంలో ఎన్నో మలుపులు .. మరెన్నో అనుభవాలు కనిస్తాయి. దర్శకుడిగా మెగా ఫోన్ పట్టిన దగ్గర నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. దాదాపు 75 సినిమాల వరకూ ఆయన దర్శకత్వం వహించారు. వాటిలో అన్నీ పూర్తి వినోదభరితమైనవే .. అశేష ప్రేక్షకులను హాయిగా నవ్విస్తూ అలరించినవే. ఆయన ఎంతోమంది హీరోలతోను .. నిర్మాతలతోను కలిసి పనిచేశారు.

అలాంటి రేలంగి నరసింహారావు ఈ వారం 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక సంఘటనను గురించి ప్రస్తావించారు. "నా కెరియర్లో నేను ఒక సినిమాను మొదలుపెట్టేసి .. మూడు రోజుల్లో ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న సందర్భం ఉంది. ఆ సినిమా పేరు 'పెళ్లిచేసి చూపిస్తాం'. ఈ సినిమాకి హీరో చలం గారు నిర్మాత. అప్పటికే ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నిర్మాతగా ఆయన ఓ రీమేక్ సినిమా చేయమని అడిగితే, దర్శకుడిగా నేను సరేనన్నాను. ఆ సినిమాకి సంబంధించిన పనుల్లో చేరిపోయాను.

రీమేక్ సినిమా కావడంతో చలం గారు .. రాజశ్రీగారు కలిసి, తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథలో మార్పులు .. చేర్పులు చేస్తున్నారు. ఆ పని కోసం నన్ను పిలవడం లేదు. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి .. నన్ను పిలవడం లేదు. దాంతో నేను మానసికంగా కుంగిపోతున్నాను. తెల్లారితే షూటింగు అనగా, మరుసటి రోజు ఏ సీన్లు చేయబోయేది చలం గారు నాకు చెప్పారు. ఏ సీన్లు చేస్తున్నామని నన్ను అడగకుండా .. ఫలానా సీన్లు చేస్తున్నామని నాకే ఆయన చెప్పారు. ఉదయాన్నే లొకేషన్ కి వెళ్లి ఏం చేయాలనేది కూడా ఆయనే చెప్పారు.

మొదట్లో నాతో ఆయన మాట్లాడిన తీరుకు .. ఆ తరువాత మాట్లాడుతున్న విధానానికి నాకు తేడా తెలిసిపోయింది. ఆయన పద్ధతి మనసుకు కాస్త బాధను కలిగించినప్పటికీ, నేను ఉదయాన్నే లొకేషన్ కి వెళ్లాను. అక్కడ ఆర్టిస్టులకు ఆయనే డైలాగ్స్ చెప్పేవారు .. వాళ్లతో రిహార్సల్స్ చేయించేవారు. యాక్షన్ అని చెప్పండి .. కట్ అని చెప్పండి అని నా పక్కనే ఉంటూ నేను ఏం చేయాలో చెప్పడం మొదలుపెట్టారు. అలా మూడు రోజులు షూటింగు చేశాక ఇక నాలో సహనం చచ్చిపోయింది. దాంతో ఇక నా మనసులోని మాటను ఆయనకి చెప్పేశాను.

సెట్స్ పై నాకు సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోవద్దని అన్నాను. 'నా బ్యానర్లో చేయడానికి ఏ దర్శకుడు వచ్చినా అన్నీ నేనే చూసుకుంటాను .. వాళ్లు స్టార్ట్ .. కట్ చెబితే సరిపోతుంది' అని చలం గారు అన్నారు. ఆ విషయం నాకు ముందుగా మీరు చెప్పలేదు అన్నాను. తను చెప్పినట్టుగా చేయవలసిందేనని ఆయన అన్నారు. అలా చేయడం నా వల్ల కాదు .. నేను చేయలేను .. సారీ అని అక్కడే తేల్చి చెప్పేశాను. అలా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవలసి వచ్చింది" అని ఆయన చెప్పుకొచ్చారు.