Begin typing your search above and press return to search.

కోపంతో ఆ డైరెక్టర్ ఆయన చెంపమీద కొట్టాడట!

By:  Tupaki Desk   |   10 Aug 2021 2:30 PM GMT
కోపంతో ఆ డైరెక్టర్ ఆయన చెంపమీద కొట్టాడట!
X
తెలుగులో జంధ్యాల తరువాత హాస్యకథా చిత్రాలు ఎక్కువగా చేసిన దర్శకుడిగా రేలంగి నరసింహారావు కనిపిస్తారు. కథాకథనాలను ఆయన అల్లుకునే తీరు .. పాత్రలను మలిచే విధానం గమ్మత్తుగా ఉండేది. అంతేకాదు .. చాలా తక్కువ బడ్జెట్లో .. చాలా వేగంగా సినిమాలు చేసేవారు. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా హాస్యకథా చిత్రాలను ఆయన పరిగెత్తించారు. రాజేంద్రప్రసాద్ హీరోగా ఆయన 32 సినిమాలను తెరకెక్కించారంటే ఆయన దూకుడును అంచనా వేసుకోవచ్చు. అలాగే చంద్రమోహన్ హీరోగా 24 సినిమాలను రూపొందించడం విశేషం.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. "నా కెరియర్లో నేను ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి జరిగింది. అవి నేను దర్శకుడు కె.ఎస్.ఆర్.దాస్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న రోజులు. ఎమ్మెస్ రెడ్డి గారు నిర్మిస్తున్న 'ఊరికి ఉపకారి' సినిమాకు ఆయన దర్శకత్వం చేస్తున్నారు. షాట్స్ తీయడంలో ఆయన చాలా స్పీడ్. నాకు ఆయన ఎంతమాత్రం సమయం ఇచ్చేవారు కాదు. నెక్స్ట్ షాట్ కి వెంటనే రెడీగా ఉండాలి. అందువలన నేను ఎక్కువగా కంగారు పడిపోయేవాడిని.

ఒక షాట్ పూర్తి కాగానే .. క్లాప్ బోర్డు నేలపై పెట్టేసి వేరే పని చేస్తున్నాను. అంతలో ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన కాళ్లు కనిపించగానే నేను తలెత్తి పైకి చూశాను. "లేరా .. క్లాప్ బోర్డు అక్కడి నుంచి తీయి .."అన్నారు కోపంగా. నేను క్లాప్ బోర్డు పట్టుకుని లేచి నిలబడ్డాను .. అంతే నా చెంప పగులగొట్టారు. "క్లాప్ బోర్డు నెల మీద పెడతావా? దీని విలువ తెలుసారా నీకు? ఇది మనకు సరస్వతిరా .. నిర్మాతలకు లక్ష్మీరా .. అలాంటి దానిని నలుగురూ తిరిగే రోడ్డుపై పెడతావా? ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు" అన్నారు.

ఆయన చెంపదెబ్బ కొట్టినందుకు నాకు బాధ కలగలేదు .. ఆ రోజు నాకు క్లాప్ బోర్డు విలువ ఏంటనేది తెలిసింది. నిజానికి ఇప్పటి డిజిటల్ సిస్టంలో మనకి క్లాప్ అవసరం లేదు. కానీ పూజా కార్యక్రమాల్లో క్లాప్ బోర్డు పెడుతున్నాము. దానిని స్క్రిప్ట్ తో పాటు డైరెక్టర్ కి ఇస్తున్నాము. అంటే క్లాప్ బోర్డుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థమవుతోంది" అంటూ చెప్పుకొచ్చారు.