Begin typing your search above and press return to search.

స‌ర్కార్ రిలీజ్‌ కి బ్రేకులు?

By:  Tupaki Desk   |   26 Oct 2018 5:28 AM GMT
స‌ర్కార్ రిలీజ్‌ కి బ్రేకులు?
X
ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ - ఏ.ఆర్‌.మురుగ‌దాస్ క్రేజీ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన `స‌ర్కార్‌` దీపావ‌లి కానుక‌గా న‌వంబ‌ర్ తొలివారంలో రిలీజ్‌ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ అత్యంత భారీ బ‌డ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో వ‌ల్ల‌భ‌నేని అశోక్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు హ‌క్కులు కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే. అయితే స‌ర్కార్ ఈ దీపావ‌ళి కానుక‌గా రిలీజ‌వుతోందా.. లేదా? అంటే ఇంకా సందిగ్ధ‌మేన‌ని తాజా వివాదం చెబుతోంది.

ప్ర‌స్తుతం ఈ మూవీపై కోర్టు కేసు న‌డుస్తోంది. ఏ.ఆర్‌.మురుగ‌దాస్ త‌న క‌థ‌ను కాపీ కొట్టారంటూ వ‌రుణ్ రాజేంద్ర‌న్ అనే ర‌చ‌యిత మ‌ద్రాస్‌- హైకోర్టుకు ఫిర్యాదు చేయ‌డంతో ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంది. 2007లోనే సౌతిండియ‌న్ ఫిలిం రైట‌ర్స్ అసోసియేష‌న్‌ లో `సెంగోల్‌` అనే క‌థ‌ను రిజిష్ట‌ర్ చేయించాన‌ని - ఆ క‌థ‌ను మురుగ‌దాస్ కాపీ కొట్టార‌ని - పైగా దాంట్లో మార్పు చేర్పులు చేసి `స‌ర్కార్‌` పేరుతో సినిమా తీసేశార‌ని రాజేంద్ర‌న్ ఆరోపించారు. దీనిపై రైట‌ర్స్ అసోసియేష‌న్‌ లోనూ పంచాయితీ న‌డుస్తోంది. క‌థ కాపీ కొట్టినందుకు మురుగ‌దాస్- క‌ళానిధి మార‌న్ బృందం త‌న‌కు 30ల‌క్ష‌లు చెల్లించాల్సిందేనంటూ స‌ద‌రు ర‌చ‌యిత హైకోర్టులో కేసు వేయ‌డంతో సీరియ‌స్‌ గానే దీనిపై విచార‌ణ సాగుతోంది. త‌న‌కు పారితోషికం ముట్టే వ‌ర‌కూ రిలీజ్ ఆపాల్సిందిగానూ రాజేంద్ర‌న్ కోర్టులో వాదిస్తున్నారు. దీంతో కోర్టు విచార‌ణ తేలే వ‌ర‌కూ ఇంకా దీపావ‌ళి రిలీజ్ సందిగ్ధ‌మేన‌న్న మాటా వినిపిస్తోంది.

అయితే విచార‌ణ‌లో కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన కోర్టు న్యాయ‌మూర్తులు.. ఈనెల 30లోగా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మురుగ‌దాస్ - స‌న్ పిక్చ‌ర్స్ వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేన‌ని ఆర్డ‌ర్స్ జారీ చేశారు. అప్ప‌టివ‌ర‌కూ సినిమాని వాయిదా వేయ‌డం కుద‌ర‌ద‌ని పేర్కొన్నారు. దీంతో ఇప్ప‌టికి వాయిదా అని చెప్ప‌లేం. కానీ విచార‌ణానంత‌ర ప‌రిణామాలు ఎలా ఉంటాయోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఈ కేసు విష‌య‌మై సౌతిండియా ర‌చ‌యిత‌ల సంఘం అధ్య‌క్షుడు కె.భాగ్య‌రాజాను ప్ర‌శ్నిస్తే.. క‌థ‌లు ఒకే త‌ర‌హాలో ఉండ‌డం .. ఈ త‌ర‌హా గొడ‌వ‌లు చాలా కాలంగా ఉన్న‌వేనని అన్నారు. స‌ర్కార్ క‌థ సెంగోల్ క‌థ ఒకేలా ఉన్నాయ‌ని ఆయ‌న‌ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం కోర్టుల ప‌రిధిలో విచార‌ణ సాగుతోంది.

కాపీ క్యాట్ హిస్ట‌రీ గ‌త చ‌రిత్ర ప‌రిశీలిస్తే.. మురుగ‌దాస్‌పై ఈ త‌ర‌హా కాపీక్యాట్ వివాదాలు ఇదే తొలిసారి కాదు. ఇంత‌కుముందు ఈ త‌ర‌హా గొడ‌వ‌లున్నాయి. మురుగ‌దాస్ తెరకెక్కించిన సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ `గ‌జిని` క్రిస్టోఫ‌ర్ నోలాన్ తెర‌కెక్కించిన‌ హాలీవుడ్ మూవీ `మెమెంటో`కి కాపీ అని ప్ర‌చార‌మైంది. విజ‌య్ హీరోగా మురుగ‌దాస్ తెరకెక్కించిన `క‌త్తి` క‌థ నాదేనంటూ మింజుర్ గోపి అనే స్క్రిప్టు ర‌చ‌యిత అప్ప‌ట్లో కోర్టులో పోరాడాడు. చివ‌రికి అత‌డు రాజీకొచ్చి బేరం కుదుర్చుకున్నాడ‌ని ప్ర‌చార‌మైంది. ప్ర‌స్తుతం `స‌ర్కార్` క‌థ‌పైనా అంతే వివాదాలు ముసురుకోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కొచ్చింది.