Begin typing your search above and press return to search.

రిలీజులు ప్లాన్ చేస్తున్నారు సరే.. అప్పటికి టికెట్ ఇష్యూ పరిష్కారమయ్యేనా..?

By:  Tupaki Desk   |   29 Jan 2022 1:30 PM GMT
రిలీజులు ప్లాన్ చేస్తున్నారు సరే.. అప్పటికి టికెట్ ఇష్యూ పరిష్కారమయ్యేనా..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇప్పటికే రెండుసార్లు సమావేశం అయింది. ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి 10న ఈ అంశం మీద తదుపరి విచారణ జరగనుంది. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల పెద్ద సినిమాల విడుదలకు ఇబ్బందిగా మారుతోంది.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలు షెడ్యూల్ ప్రకారం వస్తాయో లేదో అనే సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు టికెట్ రేట్ల అంశం - పెద్ద సినిమాల రిలీజుల మీద స్పందించారు.

ఫిబ్రవరి చివరి నాటికి పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన దిల్ రాజు.. పెద్ద సినిమాలన్నీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి - ఏప్రిల్ - మే వరకు అన్ని పెద్ద సినిమాలు వచ్చేస్తాయని.. సమ్మర్ లోపు పెద్ద సినిమాల రౌండ్ పూర్తయిపోతుందని పేర్కొన్నారు.

అలానే ఏపీలో టికెట్ రేట్లపై స్పందించిన దిల్ రాజు.. ప్రభుత్వం నియమించిన కమిటీ చురుగ్గా పని చేస్తుందని.. పెద్ద సినిమాలు విడుదలయ్యే సమయానికి టికెట్ల ఇష్యూ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే అన్నీ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఎప్పుడు సమర్పిస్తున్న దానిపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో తాము పాజిటివ్ గా ఉన్నామని.. అన్నీ సెట్ అవుతాయని అనుకుంటున్నానన్నారు.

ఇప్పటికే పలువురు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసారని.. ఫైనల్ గా అందరం ఓ అండర్ స్టాండింగ్ తో ముందుకెళ్లాల్సిందేనని దిల్ రాజు తెలిపారు. పెద్ద సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుందని.. 'ఆర్.ఆర్.ఆర్' వస్తే తాను 'ఎఫ్ 3' చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సిందేనని అగ్ర నిర్మాత అన్నారు.

దిల్ రాజు చెప్పినట్లు ఫిబ్రవరి నెలాఖరు నుంచి పెద్ద సినిమాల విడుదల ప్లాన్ చేసినా.. అప్పటికి ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల సమస్య పరిష్కారం కాకపోతే పరిస్థితి ఏంటి? అనేది ఇక్కడ ఆలోచించాల్సిన ప్రధాన అంశం. ఏపీ సర్కారు అప్పటికి సరికొత్త జీవో జారీ చేయకపోతే మాత్రం పాన్ ఇండియా చిత్రాల రిలీజ్ గురించి పునరాలోచించే అవకాశం ఉంది. ఒకవేళ ధైర్యం చేసి విడుదల చేస్తే ప్రస్తుతమున్న రేట్లతో ఏపీలో సినిమా వసూళ్లకు గండి పడుతుందని చెప్పవచ్చు.