Begin typing your search above and press return to search.

మరో సంగీత శిఖరం నేలకొరిగింది.. వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ ఇకలేరు

By:  Tupaki Desk   |   3 Nov 2020 4:15 AM GMT
మరో సంగీత శిఖరం నేలకొరిగింది.. వయోలిన్ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్ ఇకలేరు
X
సంగీత ప్రపంచం మరో సారి మూగపోయింది. ఎస్పీ బాలు మరణాన్ని మరువక ముందే మరో సంగీత శిఖరం మన మధ్య నుంచి నేల రాలింది. ప్రఖ్యాత వయోలిన్​ విద్వాంసుడు టీఎన్ కృష్ణన్(92) తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. కానీ సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనంతరం తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణన్​ మరణవార్త విని ఆయన సంగీత అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కృష్ణన్​ మృతిపై ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అయ్యర్​ స్పందించారు. 'గత నెలలోనే ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. అప్పుడాయన చాలా యాక్టివ్​గా ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కూడా బాగానే ఉన్నారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా బాధాకరం’ అని పేర్కొన్నారు. టీఎన్ కృష్ణన్-లాల్‌గుడి జయరామన్-ఎంఎస్ గోపాలకృష్ణ వయోలిన్ త్రయంగా పేరు తెచ్చుకున్నారు.

ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి దేశవ్యాప్తంగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కేరళ రాష్ట్రంలోని త్రిపునిథురలో అక్టోబర్ 6,1928న కృష్ణన్​ జన్మించారు. ఆయన తండ్రి నారాయణ అయ్యర్ గొప్ప సంగీత విద్వాంసుడు.. కృష్ణన్​ ఆయన వద్దే వయోలిన్​, సంగీత పాఠాలను నేర్చుకున్నారు. ఆయన తల్లి అమ్మిని అమ్మాల్ కు కూడా సంగీత అభిరుచి ఉండేది.
1942లో ఆయన చెన్నైకి వచ్చారు. కొంతకాలంపాటు చెన్నై మ్యూజిక్ కాలేజీలో వయోలిన్ టీచర్‌గా పనిచేశారు. ఢిల్లీ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ డీన్‌గా కూడా ఆయన వ్యవహరించారు. కృష్ణన్​ కొన్ని వేల సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. భారత ప్రభుత్వం ఆయన సంగీత సేవలకు మెచ్చి 1973లో పద్మశ్రీ,1992లో పద్మభూషణ్,1974లో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు,1980లో సంగీత కళానిధి అవార్డు ప్రదానం చేసింది. కృష్ణన్​ మృతికి తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్​ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రియులకు తీరని లోటని పేర్కొన్నారు.