Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ మాజీ వైఫ్..సేఫ్

By:  Tupaki Desk   |   14 Nov 2015 1:07 PM IST
పవర్ స్టార్ మాజీ వైఫ్..సేఫ్
X
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య - నటి రేణూ దేశాయ్ ప్యారిస్ లో ఉగ్రవాదుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మూడు వారాల కిందట ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన ఆమె కొద్ది రోజులుగా అక్కడే ఉంటున్నారు. నిన్న రాత్రి ఉగ్రవాదులు దాడి జరిపిన ప్రాంతంలోనే ఆమె బస చేశారు. అయితే.. అదృష్టవశాత్తు దాడులకు కొద్ది ముందే ఆమె తన పర్యటన ముగించుకుని భారత్ కు వచ్చేశారు. దీంతో ఆమెకు పెను ప్రమాదం తప్పింది.

కొన్ని వారాలుగా ఫ్రాన్స్ లోనే ఉన్న రేణూ అక్కడ ఉగ్రవాద దాడికి కొద్ది గంటల ముందు అక్కడ నుంచి బయలుదేరారు. నిన్న రాత్రే ఆమె ప్యారిస్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం ముంబై విమానాశ్రయం చేరుకున్నారు. అయితే... ముంబయిలో దిగేవరకు ఆమెకు విషయం తెలియదట. ఇక్కడ దిగిన తరువాత ముందు రోజు వరకు తాను బస చేసిన ప్రాంతంలోనే ఉగ్రవాదులు దాడి చేశారన్న సంగతి తెలిసి ఆమె ఎంతో ఆందోళనకు గురయ్యారు. అయితే... అదృష్టవశాత్తు అక్కడి నుంచి బయటపడడంతో ఆమె సంతోషం వ్యక్తంచేశారు. ఘటనపై ఆమె ట్విట్టర్ లో స్పందించారు కూడా. ''ప్యారిస్ నుంచి ఇప్పుడే ముంబయి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాకే ప్యారిస్ లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసింది. నా క్షేమం కోరుతూ శుభ సందేశాలు పంపించిన అందరికీ నా కృతజ్ఙతలు'' అంటూ రేణూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

బద్రి, జానీ వంటి సినిమాల్లో కథానాయికగా, అంతకుమించి పవర్ స్టార్ ఒకప్పటి భార్యగా పాపులర్ కావడంతో పాటు లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న రేణూ దేశాయ్ భయంకరమైన ఉగ్రవాద దాడి నుంచి బయటపడడంపై పవన్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.